- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాహ డెవలపర్స్ మాయ!..
ఫ్రీ లాంచ్ పేరుతో ముందస్తుగా ప్లాట్లను అమ్మి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా కస్టమర్లను బురిడీ కొట్టించిన సంస్థలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి.

దిశ, సంస్థాన్ నారాయణపురం: ఫ్రీ లాంచ్ పేరుతో ముందస్తుగా ప్లాట్లను అమ్మి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా కస్టమర్లను బురిడీ కొట్టించిన సంస్థలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. స్పెషల్ లాంచింగ్ ఆఫర్ పేరుతో కస్టమర్లకు రంగురంగుల బ్రోచర్లను వేసి కేవలం డ్రాఫ్ట్ లేఅవుట్ అనుమతులు తెచ్చుకొని పేపర్ పైనే కస్టమర్లకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఎలాంటి డెవలప్మెంట్లు చేయకుండా చేతులు ఎత్తేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ పరిధిలో గతంలో చేసిన 900 ఎకరాల వెంచర్లో కూడా ఈ తరహా మోసాలు జరగడంతో ఎంతోమంది కస్టమర్లు అప్పటి యజమానిపై ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 43/1లో సాహ డెవలపర్స్ సంస్థ సాహ'స్ హిల్ క్రెస్ట్ పేరుతో 33 ఎకరాలలో డీటీసీపీ ప్రారంభ అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టింది. అయితే కేవలం సదరు 33 ఎకరాల వెంచర్ లో మట్టి రోడ్లు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్లాట్లు కొని కస్టమర్లు మోసపోవాల్సిందేనా..
రాచకొండ రెవెన్యూ పరిధిలో చేసిన ఈ 33 ఎకరాల వెంచర్ కు డీటీసీపీ ప్రారంభ అనుమతులు ఇచ్చింది. అయితే ఈ సంస్థ ఆదివారం బ్రోచర్ ను విడుదల చేసి ప్లాట్ల అమ్మకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలువురు కస్టమర్లను సైట్ వద్దకు ఆహ్వానించి ప్లాట్ల కొనుగోలుకు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేయకుండా కస్టమర్ల వద్ద బయానాలు తీసుకొని చేతులు ఎత్తివేస్తే దానికి సామాన్య ప్రజలు బలికాక తప్పని పరిస్థితి నెలకొంటుంది. డీటీసీపీ కేవలం పనులు ప్రారంభించుకోవడానికి మాత్రమే అనుమతులు ఇచ్చిన సాహ డెవలపర్ సంస్థ స్పెషల్ లాంచింగ్ ఆఫర్ పేరుతో ప్లాట్ల విక్రయానికి పూనుకోవడం చట్ట విరుద్ధం.
మౌలిక వసతుల ఊసే లేదు!..
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన వ్యాపారులు, అధికారులు కుమ్మకై సామాన్య ప్రజలను మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. గ్రామపంచాయతీ అనుమతులతో లేఔట్లు ఏర్పాటు చేస్తే గ్రామపంచాయతీకి రావాల్సిన 10% ల్యాండ్ ను స్థానికంగా తమ పలుకుబడి ఉపయోగించుకొని ఎగ్గొడుతున్నారనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో కూడా డీటీసీపీ అనుమతులు తప్పనిసరి చేసింది. డీటీసీపీ నిబంధనల ప్రకారం వెంచర్ లో కావలసిన మౌలిక వసతులు అయిన విద్యుత్, డ్రైనేజీ, వాటర్,రోడ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రామపంచాయతీకి ఇవ్వవలసిన 10% భూమితో పాటు మౌలిక వసతులు పూర్తయ్యే వరకు కొన్ని ప్లాట్లను గ్రామపంచాయతీ పేరుపై మార్ట్ గేజ్ కూడా చేయవలసి ఉంటుంది. మాలిక వసతులు పూర్తి అయ్యాయని గ్రామపంచాయతీ ఎన్ఓసి ఇచ్చి మార్ట్ గేజ్ ప్లాట్లను రిలీజ్ చేసిన తర్వాతే సదరు డీటీసీపీ వెంచర్ కు ఫైనల్ అప్రూవల్ లు వస్తాయి.
ఇవన్నీ వచ్చిన తర్వాతే సదరు యాజమాన్యాలు కస్టమర్లకు ప్లాట్లను అమ్ముకోవాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ రాచకొండలో 33 ఎకరాలలో సాహ డెవలపర్స్ సంస్థ చేస్తున్న వెంచర్ లో పూర్తి కాలేదు.అంతేకాకుండా ప్లాట్లను గుర్తించేందుకు ప్లాటింగ్ రాళ్లను కూడా నాటలేదు. అయినా కానీ యాజమాన్యాల దుర్బుద్ధితో ఎలాంటి వసతులు పూర్తి చేయకుండానే కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేసి స్థానికంగా సబ్ రిజిస్ట్రార్లు, గ్రామపంచాయతీ అధికారులతో కుమ్మక్కై కస్టమర్లకు ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి డెవలప్మెంట్ చేయకుండానే చేతులెత్తేసేందుకు సహకారం అందిస్తున్నారు. కావున ఈ మౌలిక వసతులు పూర్తి కాకుండా కస్టమర్లు కూడా అలాంటి వెంచర్లలో ప్లాట్లను కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికైనా రాచకొండ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక గ్రామపంచాయతీ అధికారులు సదరు వెంచర్లో డెవలప్మెంట్ పూర్తి కాకుండా ప్లాట్లను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.
విద్యుత్ లైన్ కు నోచుకోని వైనం!..
అయితే ప్రస్తుతం చేస్తున్న వెంచర్ తో పాటు చుట్టుపక్కల చేసిన 900 ఎకరాల వెంచర్ లో కూడా ఎక్కడ విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు కిలోమీటర్ పరిధి వరకు లైన్ లేదు. అయితే ప్రస్తుత వెంచర్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలంటే సుమారు కోటి రూపాయల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖర్చులు తప్పించుకునేందుకే ముందస్తుగా స్పెషల్ లాంచింగ్ ఆఫర్ పేరుతో ప్లాట్లను అమ్మేందుకు సాహ డెవలపర్స్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. ఇక్కడ ప్లాట్ లు కొన్న కస్టమర్లకు విద్యుత్ కనెక్షన్ అనేది ఇక కలగానే మిగిలే అవకాశం కూడా లేకపోలేదు. కావున కస్టమర్లు విద్యుత్ తో పాటు డ్రైనేజీ, రోడ్లు పూర్తయ్యాకే ప్లాట్లకు అడ్వాన్సులు చెల్లించాలని, లేదంటే రంగురంగు బ్రోచర్ల మాయలో పడి మోసపోక తప్పని పరిస్థితి నెలకొంటుంది.






