రైతులకు చట్టాలపై అవగాహన అవసరం : భూమి సునీల్

by Bhanu |

తెలంగాణ వ్యవసాయ , రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ శుక్రవారం కేతేపల్లి మండలంలో "సాగు న్యాయ యాత్ర" చేపట్టారు.

రైతులకు చట్టాలపై అవగాహన అవసరం  : భూమి సునీల్
X

దిశ, నకిరేకల్ టౌన్ : తెలంగాణ వ్యవసాయ , రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ శుక్రవారం కేతేపల్లి మండలంలో "సాగు న్యాయ యాత్ర" చేపట్టారు. కేతేపల్లిలోని రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో భూమి సునీల్ మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడినప్పుడే నిజమైన సాగు న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. కేతేపల్లినుండి కుసుమంచి వరకు సాగు న్యాయ యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్‌లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో పలు దేశాల్లో భూ చట్టాలను సమర్థంగా వినియోగిస్తూ రైతులు లబ్ధి పొందుతున్నారని, అలాంటి అవగాహన మన రైతులకూ ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయనీ, అవన్నీ రైతులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రైతులకు ప్రతి ఒక్కరు తలా పదిమందికి ఈ విషయాలను తెలియజేయాలన్న పిలుపునిచ్చారు. ఇది దేశంలోనే తొలిసారిగా సాగు చట్టాలపై రైతులలో లోతైన అవగాహన కల్పించేందుకు చేపట్టిన అధ్యయన యాత్రగా గుర్తించారు. అంతేకాకుండా, వినూత్న పంటల వైపు దృష్టి సారించాలని, అధికంగా ఎరువుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్నారని హెచ్చరించారు.

రైతులు సభలో పలు సమస్యలను తెరపైకి తెచ్చారు. భూమికి పట్టా ఉన్నప్పటికీ ఆక్రమణల పాలవడం, రిజిస్ట్రేషన్‌కు మ్యాప్ అవసరమవడం, భూ వివాదాల వంటి అంశాలను ప్రస్తావించారు. భూమి సునీల్ ఈ సమస్యలను భూ చట్టాల ఆధారంగా పరిష్కరించవచ్చని వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 6000 మంది సర్వే సిబ్బందిని శిక్షణతో సిద్ధం చేస్తుండటంతో భవిష్యత్తులో భూ సమస్యలు, భూతగాదాలు పరిష్కారమవుతాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏవొఓ ఎస్.డి చైర్మన్ హరి వేంకట ప్రసాద్, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కోదండ రెడ్డి, లిప్స్ సంస్థ ప్రతినిధులు, అడ్వకేట్లు జీవన్, అభిలాష్, సందీప్, మల్లేష్, ఇరుగు రవి ప్రవీణ్, కేతేపల్లి ఏవొ పురుషోత్తం, ఏఈఓలు బాలరాజు, ఉమేష్, నాగరాజు, రైతులు మహేందర్ రెడ్డి, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story