మహిళా సంఘాల్లో అక్రమాల ఆరోపణలు.. అప్పుల ఊబిలో స్త్రీ నిధి

by Naga Rani Yarlagadda |

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో మహిళా సంఘాల స్త్రీనిధి బకాయిలు రూ.2కోట్లకు చేరాయి.

మహిళా సంఘాల్లో అక్రమాల ఆరోపణలు.. అప్పుల ఊబిలో స్త్రీ నిధి
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో మహిళా సంఘాల స్త్రీనిధి బకాయిలు రూ.2కోట్లకు చేరాయి. రుణాల చెల్లింపుల్లో నికార్సైన మహిళలను కొందరు వీవోఏలు తప్పుదోవ పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. సభ్యులకు తెలియకుండా వారి పేర్లపై లోన్లు తీసుకుని సొంతానికి వాడుకుంటూ, తిరిగి చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. దీనివల్ల పాత రుణాలు క్లియర్ కాక, కొత్తగా స్వయంగా ఉపాధి పొందేందుకు బ్యాంకులకు వెళ్తున్న మహిళలకు లోన్లు రావడం లేదు. లోన్లు మంజూరు చేయించాలన్నా వీవోఏలు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి ఆడిట్ నిర్వహించాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. సంఘాల నిర్వహణ కోసం గౌరవ వేతనాలపై విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను (వీఓఏ) కూడా నియమించింది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఐకేపీ మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ దారి తప్పుతోంది. ఒక్క స్త్రీనిధి బకాయిలే గత కొన్ని సంవత్సరాలుగా సుమారు రూ.2కోట్ల వరకు పేరుకుపోయాయి. వీటికి అదనంగా బ్యాంకుల నుంచచి తీసుకున్న రుణాల బకాయిలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ బకాయిలకు మహిళా సంఘాల సభ్యులు కారణం కాదని, వారిని నడిపిస్తున్న కొందరు వీవోఏల చేతిలోనే నిరక్షరాస్యులైన మహిళలు మోసపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సభ్యుల పేర్లతో వీవోఏల చేతివాటం

సాధారణంగా మహిళా సంఘాల్లోని 10మంది సభ్యులకు కలిపి రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే, తమకు డబ్బులు అవసరం లేదని చెప్పే అమాయక మహిళా సంఘాల సభ్యుల పేర్లను ఆసరాగా చేసుకుని పలువురు వీవోఏలు వారి పేరుపై రుణాలను డ్రా చేస్తున్నారు. ఆ డబ్బును తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారు. మండల పరిధిలోని ఒక గ్రామంలోని మహిళా సభ్యులంతా తాము తీసుకున్న రుణాన్ని ఏడాది క్రితమే పూర్తిగా చెల్లించారు. కానీ, అందులోని కొందరి పేర్లపై వీవోఏ తీసుకున్న ల్యాప్స్ లోన్ డబ్బును ఇంకా కట్టలేదు. దీంతో బ్యాంకర్లు ఆ సంఘానికి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. దీనిపై సదరు వీవోఏను ప్రశ్నిస్తే ఎదురు తిరుగుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని మహిళలు వాపోతున్నారు.

అధికారుల అండదండలు

వీవోఏల అక్రమాలపై బాధిత మహిళలు స్థానిక కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు (సీసీ), ఏపీఎం ల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మండల అధికారులకు పూర్తి విషయం తెలిసినా సదరు వీవోఏలపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఈ అవకతవకల్లో స్థానిక ఐకేపీ అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. మహిళలు తమ బాధలను రోడ్డెక్కి చెప్పుకునేందుకు వెనుకాడుతుండడంతో వీవోఏల ఆటలు సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

కమీషన్లు ఇస్తేనే లోన్లు.. ముందస్తు సంతకాలు

మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించేందుకు కూడా కొందరు వీవోఏలు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు అడిగినంత ఇచ్చుకోకుంటే లోన్లు రాకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. అంతేకాకుండా, సంఘాల మీటింగులలో ఎలాంటి తీర్మానాలు రాయకుండానే ముందస్తుగా మహిళల సంతకాలు తీసుకుని, ఆ తర్వాత తమకు నచ్చినట్లు తీర్మానాలు రాసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి లోతైన విచారణ జరిపి, ఆడిట్ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story