- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెవలపర్, యజమాని మధ్య వివాదం.. శ్రీరంగాపురం వెంచర్‌లో జేసీబీలతో రోడ్ల ధ్వంసం
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వెంచర్‌లో డెవలపర్, స్థల యజమాని మధ్య తలెత్తిన ఆర్థిక వివాదం చివరకు సామాన్య ప్లాట్ల కొనుగోలుదారులకు శాపంగా మారింది.

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వెంచర్‌లో డెవలపర్, స్థల యజమాని మధ్య తలెత్తిన ఆర్థిక వివాదం చివరకు సామాన్య ప్లాట్ల కొనుగోలుదారులకు శాపంగా మారింది. నిబంధనల ప్రకారం వేసిన రోడ్లను యజమాని జేసీబీలతో తవ్వేయడంతో వెంచర్ మొత్తం గుంతలమయంగా మారింది. దీంతో ప్లాట్లకు వెళ్లే దారులు పూర్తిగా మూసుకుపోయాయి. రూ.లక్షలు వెచ్చించి స్థలాలు కొన్న తాము ఇప్పుడు లోపలికి వెళ్లడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలను తొలగించి కంచె వేయడం వల్ల రాత్రివేళల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి అక్రమ చర్యలు జరుగుతున్నాయని, అనుమతులు ఉన్న మౌలిక వసతులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నా మౌలిక వసతులను ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ బాధితులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్లాట్ల యజమానులు హెచ్చరిస్తున్నారు.
- దిశ, కోదాడ
దిశ, కోదాడ : మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద 639 సర్వే నంబర్‌లో అభివృద్ధి చేసిన ఓ వెంచర్‌లో వివాదం తీవ్ర రూపం దాల్చింది. రోడ్లు, విద్యుత్ సదుపాయాలకు సంబంధించిన అనుమతులు పొందిన అనంతరం వెంచర్ అభివృద్ధిదారులు స్థల యజమానికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో సమస్య తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అసలు స్థల యజమాని వెంచర్‌లో వేసిన రోడ్లను ధ్వంసం చేయడమే కాకుండా, విద్యుత్ స్తంభాలను తొలగించి చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. రోడ్లను పూర్తిగా గుంతలమయంగా చేయడంతో వెంచర్‌లోని ప్లాట్లకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. వెంచర్ కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన తమకు ఇప్పుడు కనీసం లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదని వారు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉండడంతో రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం పూర్తిగా డబ్బుల లావాదేవీలకు సంబంధించినదేనని, అభివృద్ధిదారులు ఒప్పందం మేరకు చెల్లింపులు చేయకపోవడంతోనే ఈ చర్యలకు పాల్పడ్డానని స్థల యజమాని వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వెంచర్ డెవలపర్లు మాత్రం ఇది అక్రమ చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ ఈ ఘటనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని కొనుగోలుదారులు హెచ్చరిస్తున్నారు.
అధికారుల కాలయాపన...
పట్టణ అభివృద్ధి నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందే పట్టణాలు మాత్రమే భవిష్యత్తులో సౌకర్యవంతంగా ఉంటాయని, అందుకు కావాల్సిన పచ్చదనం, పార్కులు, ఓపెన్ స్పేస్‌లు తప్పనిసరి అని వారు చెబుతున్నారు. కోదాడలో గతంలో జరిగిన ఈ లోపాలను సరిదిద్దకుండా ముందుకు వెళ్లడం ప్రమాదకరమని, కనీసం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పట్టణ ప్రజల ఒకే స్వరం...
కోదాడలో అభివృద్ధి పేరు పెట్టుకుని భూములు ఎవరి ప్రయోజనాల కోసం వదిలివేశారో విచారణ జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కొత్త విధానాలు తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోదాడ అభివృద్ధిలో ఈ అంశం కీలకమవడంతో ప్రజల దృష్టి ఇప్పుడు పూర్తిగా మున్సిపాలిటీపై నిలిచింది. అధికారులు స్పందించి వాస్తవాలు బయటపెట్టాలనే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.
అధికారులు జోక్యం చేసుకోవాలి...
డెవలపర్, స్థల యజమాని మధ్య ఉన్న గొడవకు మేమెందుకు బలైపోవాలి? డబ్బులు ఎవరు ఎవరికిచ్చారన్నది మాకు సంబంధం లేదు. మాకు రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కావాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు బాగానే ఉన్న రోడ్లను పూర్తిగా గుంతలుగా చేశారు. కాలు జారితే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి అక్రమ చర్యలను ప్రభుత్వం సహించకూడదు.
- ప్లాట్ల యజమానులు
అధికారులకు ఫిర్యాదు చేశాం.
ఈ ఘటనపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతాం. బాధితులకు న్యాయం చేయాలి.
- వెంచర్ ప్లాట్ ఓనర్ల సంఘ ప్రతినిధి
వసతుల ధ్వంసం చట్ట విరుద్ధం..
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు స్పందించారు. వెంచర్‌లో రోడ్లు, విద్యుత్ సదుపాయాల ధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. అనుమతులు పొందిన రోడ్లు, మౌలిక వసతులను ధ్వంసం చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు...
- మున్సిపల్ అధికారులు






