- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఎల్ఆర్ఎస్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్!
తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) కింద కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. జూలై 7 నుంచి ఐజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించొద్దని మున్సిపల్ శాఖ ఆదేశించింది.

తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) కింద కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. జూలై 7 నుంచి ఐజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించొద్దని మున్సిపల్ శాఖ ఆదేశించింది. డీటీసీపీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఈ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్ నుంచి ‘ఎల్ఆర్ఎస్ 20-20 ఫ్రీ రిజిస్ట్రేషన్’ లింక్‌ను అధికారులు తొలగించారు. గతంలో అమ్ముడైన ప్లాట్లనే ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి, మ్యాప్ మార్చి మళ్లీ అమ్మే ‘డబుల్ రిజిస్ట్రేషన్’ దందాకు దీనితో చెక్ పడనుంది. ఆలేరు మండలంలోని కొలనుపాక ‘స్విస్ లైఫ్’ వెంచర్ తరహాలో సామాన్య ప్రజలు మోసపోకుండా ఈ నిర్ణయం అడ్డుకట్ట వేయనుంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీలతోపాటు అన్ని మున్సిపాలిటీలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దిశ, ఆలేరు : తెలంగాణ ప్రభుత్వం అనధికారిక, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 7నుంచి ఐజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా ఎల్ఆర్ఎస్-2020 కింద కొత్త దరఖాస్తులను స్వీకరించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ&యూడీ) శాఖ మెమో నంబర్.5509/PLG.III/2025 ప్రకారం ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ ఆదేశాలను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖతోపాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డబుల్ రిజిస్ట్రేషన్ల మోసాలకు చెక్...
డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ఇచ్చిన ప్రతిపాదనల మేరకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను అప్పట్లోనే విక్రయించారు. అయితే, ఎల్ఆర్ఎస్-2020 ద్వారా గ్రామ పంచాయతీల్లోని అనధికార లేఅవుట్లకు 20శాతం ఫీజు చెల్లిస్తే ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు గతంలో అనుమతి ఉండేది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు, అప్పటికే విక్రయించిన ప్లాట్లనే లేఅవుట్ మ్యాప్ మార్చి, కొత్త పేర్లతో తిరిగి వేరే వారికి అమ్మేవారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఘోరంగా మోసపోయేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ల దందాకు శాశ్వతంగా చెక్ పడనుంది.
కొలనుపాక వెంచరే నిదర్శనం...
ఈ తరహా ల్యాండ్ మాఫియా మోసాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో జరిగిన ఒక వెంచర్ వ్యవహారమే నిదర్శనం. ఇక్కడ 2008 లో ‘స్విస్ లైఫ్ టౌన్షిప్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో ఒక వెంచర్ వేసి అందులోని అన్ని ప్లాట్లను విక్రయించారు. కానీ, సదరు రియల్ వ్యాపారి ఇప్పుడు అదే వెంచర్‌కు ‘స్విస్ లైఫ్ గ్రీన్ అవెన్యూ’గా పేరు మార్చి, పాత లేఅవుట్ మ్యాప్‌ను ఇష్టానుసారంగా మార్చేసి మళ్లీ ప్లాట్ల అమ్మకాలు మొదలుపెట్టాడు. ఎల్ఆర్ఎస్ కొత్త దరఖాస్తుల నిలిపివేత వల్ల ఇలాంటి అక్రమ విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
పోర్టల్ నుంచి లింక్ తొలగింపు...
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ఐజీఆర్ఎస్ అధికారిక పోర్టల్ నుంచి ‘ఎల్ఆర్ఎస్ 20-20 ఫ్రీ రిజిస్ట్రేషన్’ (ఎల్ఆర్ఎస్ 20-20 ఫ్రీ రిజిస్ట్రేషన్) అని ఉన్న లింక్‌ను అధికారులు తక్షణమే తొలగించారు. దీంతో ఎల్ఆర్ఎస్-2020 పరిధిలోకి వచ్చే నూతన ప్లాట్ల విక్రయాల ప్రక్రియ, రిజిస్ట్రేషన్ల స్వీకరణ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ సంపాదనకు బ్రేక్ వేయడమే కాకుండా, భూములు కొనే సామాన్యుల సొమ్ముకు భద్రత చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.






