రేషన్ బియ్యానికి తిప్పలు.. రేషన్ దుకాణాల ఎదుట జనం పడిగాపులు

by Bhanu |

ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు.

రేషన్ బియ్యానికి తిప్పలు.. రేషన్ దుకాణాల ఎదుట జనం పడిగాపులు
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు. రేషన్ దుకాణాల పేరెత్తితో జనం విసిగిపోతున్నారు. సన్న బియ్యానికి గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. తెల్లవారగానే సంచులు పట్టుకుని బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు మానుకుని మరి బియ్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు అరగంట వరకు పట్టేది.ఇప్పుడు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఒక్కో నెల బియ్యం కోసం రెండేసి సార్లు వేలిముద్ర వేయాల్సి వస్తున్నదని, మొత్తం మూడు నెలల బియ్యానికి ఆరుసార్లు వేలి ముద్ర పెట్టాల్సి వస్తున్నదని విసుగు చెందుతున్నారు. లైన్లో తమవంతు వచ్చాక తక్కువలో తక్కువ అరగంట సమయం తీసుకుంటున్నదని చెప్తున్నారు. సర్వర్ సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల వ్యాప్తంగా 31 రేషన్ దుకాణాలు

భూదాన్ పోచంపల్లి మండలంలోని 22 గ్రామపంచాయతీలు ఉండగా ఇటీవల సాయి నగర్ గ్రామపంచాయతీని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో చేర్చారు. దీంతో పోచంపల్లి మండలానికి 21 గ్రామపంచాయతీలకు తగ్గింది. అయితే మండల వ్యాప్తంగా 31 రేషన్ దుకాణాలు ఉన్నాయి. పట్టణంలో ఐదు ఉండగా, ఆయా గ్రామాలలో 26 దుకాణాలు ఉన్నాయి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డు రబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇచ్చేందుకు ఈనెల 1 నుండి 30 వరకు నిర్ణయించింది. అయితే లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకునేందుకు తిప్పలు తప్పడం లేదు.

ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వడంతో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజలకు అందించే సన్న బియ్యంను మూడు నెలలకు ఒకే సారి అందించడంలో రేషన్ షాపుల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. ప్రజలకు మూడు నెలల బియ్యంను రేషన్ డీలర్ల ద్వారా అందించడంతో రేషన్ దుకాణాల ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడంలో మూడు సార్లు బయోమెట్రిక్ పెట్టడంతో పాటుగా మూడు సార్లు బియ్యంను తూకం వేయడంలో ఇబ్బందులు పడుతున్నారు.

ఉదయం నుంచే క్యూలు

వర్తకాలం సీజన్ లో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు లబ్దిదారులకు ఒకే సారిగా మూడు నెలల పాటు రేషన్ షాపులలో బియ్యం అందిస్తున్నారని జనాలకు తెలియడంతో ఉదయం నుంచి రేషన్ దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. రేషన్ దుకాణం ఎప్పుడు తెరుస్తారారని ఎదురు చుస్తూ, ఒక్కో దుకాణం ముందు రేషన్ సంచులను లైన్ లలో ఉంచుతున్నారు. కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా క్యూలలో నిల్చుంటున్నారు.

రేషన్ లబ్దిదారులకు గతంలో బియ్యం అందించడంలో ఒకే సారీ బయోమెట్రిక్ చేసేది. రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ చేసే ఈ పాస్ మిషన్ లో మూడు నెలలకు ఒకే సారి బియ్యం ఇచ్చేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. ఒకే నెల ఒక సారి, మరో నెల ఒక సారి, మూడో నెల మరో సారి ఇలా మూడు సార్లు బయోమెట్రిక్ వేసేలా మార్పులు చేశారు. అంతేకాకుండా కేంద్రం అందించే బియ్యానికి ఒకసారి, రాష్ట్రం ఇచ్చే బియ్యానికి ఇంకోసారి వేలిముద్ర వేయాల్సి వస్తుంది. ప్రజలకు మూడు నెలల పాటుగా ఒకే సారి రేషన్ సన్న బియ్యం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో ఒక్కో లబ్దిదారులు మూడు సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉండడంతో రేషన్ డీలర్లు, ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

బయో మెట్రిక్ కి సిగ్నల్ కారణాంగా ఒక్కోక్కరికి కనీసం 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. రేషన్ షాపులలో రేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబ సభ్యునికి 6 కిలోల బియ్యం చొప్పున ఇస్తారు. కొన్ని కొన్ని ఏరియాలలో రేషన్ డీలర్లతో లబ్దిదారులు చిన్న చిన్ని వాగ్విదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు సార్లు బయోమెట్రిక్ వేసే బదులుగా ఒకే సారిగా బయోమెట్రిక్ వేసేల అధికారులు ఈ పాస్ మిషన్ లో మార్పులు చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.

Next Story