- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రిలో ప్రొటోకాల్ కష్టాలు..అధికారిక సమీక్షల్లోనూ పార్టీ నేతల హల్చల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు అధికార యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు అధికార యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోటోకాల్ నిర్వహణ, బందోబస్తు వ్యవస్థ, పార్టీ శ్రేణుల అత్యుత్సాహం వంటి అంశాలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వరుసగా చోటుచేసుకున్న ఘటనలు జిల్లా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. -దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :
సీఎం పర్యటనలో గందరగోళం.. పది నిమిషాలు వేచి చూసిన సీఎం
ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యాదగిరిగుట్ట హెలిప్యాడ్ వద్ద చోటుచేసుకున్న పరిస్థితులు రాష్ట్ర స్థాయిలోనే చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయిన అనంతరం సుమారు పది నిమిషాల పాటు సీఎం, మంత్రులు అక్కడే వేచి ఉన్నారు. వాస్తవానికి సీఎం హెలికాప్టర్ కొండ కింద ఏర్పాటు చేసిన హెలిక్యాడ్ వద్ద దిగాలని ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే రూట్ మ్యాప్ కు విరుద్ధంగా హెలికాప్టర్ టెంపుల్ సిటీ పైన దిగడం, అదే సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హెలిప్యాడ్ దిగువ ప్రాంతంలో ఉండిపోవడం, అనంతరం పైకి చేరుకోవడం కొంత గందరగోళానికి దారితీసింది. స్వయంగా ముఖ్యమంత్రి ల్యాండ్ అయిన తరువాత స్వాగతం పలికేందుకు అధికారులు సమయానికి అక్కడ లేకపోవడం, కాన్వాయ్ సిద్ధంగా లేకపోవడం, తగిన భద్రతా ఏర్పాట్లు కనిపించకపోవడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ఘటనకు హెలికాప్టర్ పైలట్ చేసిన సాంకేతిక అంచనా పొరపాటే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా భావించిన్నట్లు తెలిసింది.
మంత్రుల పర్యటనలో పార్టీ శ్రేణుల హడావిడి....
గురువారం జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. మంత్రులకు శాలువాలు కప్పి సన్మానించేందుకు ప్రయత్నిస్తూ, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాన్వాయ్ వైపు వెళ్తున్న క్రమంలో మరోవైపు తీసుకెళ్లినట్లు, దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై పార్టీ శ్రేణులను నియంత్రించిన అనంతరం మంత్రులు అక్కడి నుంచి వంగపల్లి బయలుదేరారు. ఈ ఘటనపై కూడా అధికార వర్గాల్లో సీరియస్ చర్చ జరిగినట్లు సమాచారం. వీవీఐపీ పర్యటనల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన సమయంలో పార్టీ శ్రేణుల అతిగా జోక్యం చేసుకోవడం భద్రతాపరంగా ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారిక సమీక్షలో పార్టీ నేతల హల్చల్....
జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారిక సమీక్ష సమావేశం కూడా వివాదాలకు కేంద్రబిందువైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశ మందిరంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవేశించడం చర్చనీయాంశమైంది. సాధారణంగా అధికారిక సమీక్ష సమావేశాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతులు ఉంటాయి. రాజకీయ నాయకులు, కార్యకర్తలు కాన్ఫరెన్స్ హాల్‌లోకి వస్తున్నా పోలీసులు, అధికారులు ఆపకపోవడం గమనార్హం. అధికారులు, మంత్రుల మధ్య జరగాల్సిన సమీక్ష కాస్తా పార్టీ సమావేశంలా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మౌనం వహించిన నేతలు....
ఇటు మంత్రులు గానీ, అటు స్థానిక ఎమ్మెల్యేలు గానీ తమ పార్టీ శ్రేణులను కనీసం మందలించకపోవడం, స్వేచ్ఛగా వదిలేయడం వివాదాలకు దారితీస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణుల జోక్యం పెరగడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాన్వాయ్‌లలోనూ వాళ్లదే హవా...
ఇదిలా ఉండగా జిల్లాలో తిరుగుతున్న మంత్రుల అధికారిక కాన్వాయ్‌లలో సైతం విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన విఐపీ వాహనాలు, భద్రతా వాహనాల కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెందిన ప్రైవేట్ వాహనాలే కాన్వాయ్‌ను అనుసరిస్తున్నాయనే చర్చ సాగుతోంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు భద్రతా ముప్పు కూడా పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక కాన్వాయ్‌లో అనధికార వాహనాల ప్రవేశం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
పోలీసులకు సైతం ఇబ్బందులు....
ఈ వరుస సంఘటనలు ప్రస్తుతం జిల్లా పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారాయి. నిఘా వైఫల్యం, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుండడంతో ఉన్నతాధికారులు లోతుగా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో జిల్లాలో జరిగే వీవీఐపీ పర్యటనల సందర్భంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరి ఈ పరిణామాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.






