- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ టీచర్లకు అడ్మిషన్ల సెగ..! పాఠాలు చెప్పే చేతుల్లో కరపత్రాలు?
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులపై అడ్మిషన్ల ఒత్తిడి పెంచుతున్నాయి.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. పాఠాలు చెప్పాల్సిన చేతులు.. నేడు స్కూల్ కరపత్రాలు పట్టుకుని వీధుల వెంట తిరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యాలు తమ అసలైన బిజినెస్ మైండ్ చూపిస్తున్నాయి. కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తూ, వారిని విద్యా ప్రచారకర్తలుగా మార్చేస్తున్నాయి.
నిద్రలేవగానే వేట మొదలు..
జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో, ఇక్కడి టీచర్ల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఉదయాన్నే నిద్రలేవగానే ఏ ఇంట్లో ఏ విద్యార్థి ఉన్నాడో అని ఆరా తీస్తూ టీచర్లు రోడ్ల మీదకు రావాల్సి వస్తోంది. ఒక్క భువనగిరిలోనే కాకుండా బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు వంటి ప్రాంతాల్లో కూడా టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ అడ్మిషన్ల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా యాజమాన్యాలు వీరిని రోడ్ల మీదకు పంపిస్తున్నట్లు సమాచారం.
బయటకు చెప్పలేక.. లోపల భరించలేక..
ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, చాలామంది టీచర్లు ఇలా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడాన్ని అవమానంగా భావిస్తున్నారు. కానీ, ఉద్యోగం పోతుందన్న భయం, యాజమాన్యాలు విధించే టార్గెట్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. "మేము చదువుకున్నది పిల్లలకు పాఠాలు చెప్పడానికా? లేక ఇలా ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు అడగడానికా?" అని టీచర్లు అంతర్గతంగా చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి నవ్వుతూ ప్రచారం చేస్తున్నా, లోలోపల మాత్రం తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
యాజమాన్యాల టార్గెట్లు.. వేతనాల్లో కోతలు
కొన్ని పాఠశాలలు అయితే ఒక అడుగు ముందుకు వేసి, ప్రతి టీచర్ కనీసం ఇంత మంది విద్యార్థులను చేర్పించాలనే డెడ్ లైన్లు విధిస్తున్నాయి. ఒకవేళ టార్గెట్ పూర్తి చేయకపోతే వచ్చే నెల జీతాల్లో కోతలు విధిస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చేసిన యాజమాన్యాలు, టీచర్లను కేవలం తమ లాభాల కోసం వాడే వస్తువులుగా చూడటంపై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి, టీచర్లపై జరుగుతున్న ఈ అదనపు పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






