నిధుల కొరతతో నిలిచిన మన ఊరు మనబడి పనులు..?

by Nallavelli.Anjaneyulu |

దిశ, అనంతగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం మన ఊరు-మనబడి

నిధుల కొరతతో నిలిచిన మన ఊరు మనబడి పనులు..?
X

దిశ, అనంతగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా శిధిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, తాగునీటి వసతి కల్పనతో పాటు చిన్నచిన్న మరమ్మతు పనులు చేపట్టారు. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో అనంతగిరి మండలంలో ఐదు గ్రామాల్లో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. అనంతగిరి మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో నూతన తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. నిధులు అందకపోవడంతో గోడలు, కప్పు వరకు నిర్మించి పనులను నిలిపివేయాల్సి వచ్చింది. బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు వదిలేసినట్లు తెలుస్తోంది.

నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.. మండలంలోని కొన్ని పాఠశాలల్లో మొదట్లో చేపట్టిన పనులకు బిల్లులు త్వరగా మంజూరైనా, తరువాతి దశలో బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆ తరువాత ప్రభుత్వం మారినా, నిలిచిన పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో పనులు నిలిచిపోయాయి మొత్తంగా అనంతగిరి మండలంలో మన ఊరు–మనబడి పథకంలో చేపట్టిన పనులకు కొన్ని లక్షల రూపాయల మేర బిల్లులు రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సామాజిక ఎస్సీ వాడలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేస్తే ఎస్సీ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story