- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనరల్ స్థానాల్లో బీసీలకే పట్టం..?
మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలు జనరల్ కేటగిరీలో ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకే కట్టబెట్టడం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

దిశ, చౌటుప్పల్ టౌన్ : మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలు జనరల్ కేటగిరీలో ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకే కట్టబెట్టడం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు మున్సిపాలిటీల్లోనూ ఇదే ఫార్ములా అమలు కావడం యాదృచ్ఛికమా? లేక పక్కా వ్యూహమా? అనే చర్చ జోరందుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లో ఈసారి జనరల్ స్థానాలకు రిజర్వు చేసినప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులు బీసీ వర్గానికే దక్కేలా ఎవరు పావులు కదిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలే ప్రమాణమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుండగా ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి చెలరేగుతోంది.
రెడ్డి వర్గంలో రగులుతున్న అసంతృప్తి
ఇప్పటివరకు స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి చైర్మన్ గానీ, కనీసం వైస్ చైర్మన్ గానీ దక్కకపోవడం ఆ వర్గాన్ని తీవ్రంగా కలిచివేసింది. "ఎన్నికల్లో కష్టపడ్డాం…గెలుపులో భాగమయ్యాం.. కానీ పదవుల విషయంలో పక్కనపెట్టారు" అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే వ్యూహం ఏమిటి?
స్థానిక ఎమ్మెల్యే మాత్రం దీన్ని సమగ్ర సామాజిక సమీకరణంగా చూస్తున్నామని చెబుతున్నారు. బీసీ వర్గం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో పాటు, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో బీసీ వర్గానికి నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ బలం పెరుగుతుందనే లెక్కలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
రహస్య శక్తుల ప్రమేయం
పదవుల కేటాయింపులో "రహస్య శక్తులు" పనిచేశాయనే ప్రచారం ఊపందుకుంది. ఇందులో ఎమ్మెల్యే సూచనలే కీలకమయ్యాయా? లేక పైస్థాయి నుంచి స్పష్టమైన దిశానిర్దేశం ఏమైనా వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి.
భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం?
రెడ్డి వర్గం అసంతృప్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీపై ఎంతవరకు చూపుతుందన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ ఈ వర్గంలో అసహనం పెరిగితే రాబోయే ఎన్నికల్లో ప్రతిఫలం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో బీసీ వర్గంలో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. జనరల్ స్థానంలోనూ అవకాశాలు రావడం సమానత్వానికి నిదర్శనమని అంటున్నారు. జనరల్ స్థానాల్లోనూ బీసీలకే పట్టం కట్టడం చౌటుప్పల్, చండూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం సామాజిక సమీకరణాల రాజకీయమా? లేక దీర్ఘకాల వ్యూహమా? అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ప్రస్తుతం మాత్రం రెండు మున్సిపాలిటీల్లోనూ పదవుల కేటాయింపే రాజకీయ వేడిని పెంచుతోంది.






