నిలువ నీడ లేక.. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షణ

by Kodari Anjali |

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారి–930(పీ)పై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిలువ నీడ లేక.. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షణ
X

దిశ, అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారి–930(పీ)పై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలువ నీడ లేక మండుతున్న ఎండల్లోనే గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో బస్సులు రాకపోవడంతో పాటు వచ్చిన బస్సుల్లో ఎక్కువగా డీలక్స్, లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులే ఉండటంతో సాధారణ ప్రయాణికులు ప్రయాణించలేక పల్లెవెలుగు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల సందర్భంగా గతంలో ఉన్న బస్సు షెల్టర్‌ను తొలగించడంతో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ఈ కాలంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, చిన్నారులు రహదారి పక్కనే నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. తాగునీరు, కూర్చునేందుకు స్థలం, విశ్రాంతి కోసం నీడ వంటి ప్రాథమిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్..

ఈ ప్రాంతానికి చౌళ్లరామారం స్టేజీ ప్రధాన రవాణా కేంద్రంగా ఉండటంతో చుట్టుపక్కల ఆరు నుంచి ఏడు గ్రామాల ప్రజలు ఇక్కడికే వచ్చి బస్సులు ఎక్కాల్సి వస్తోంది. అయితే అనేక ఎక్స్‌ప్రెస్ సర్వీసులు గ్రామాల స్టేజీల వద్ద ఆగకపోవడంతో ప్రజలు అదనపు వ్యయంతో పాటు సమయాన్ని కూడా కోల్పోతున్నారు. అత్యవసర పనులు, వైద్య సేవలు, విద్యా అవసరాల కోసం ప్రయాణించే వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం చౌళ్లరామారంతోపాటు, ప్రతి గ్రామాల స్టేజీల వద్ద శాశ్వత బస్సు షెల్టర్ నిర్మించడంతో పాటు తాగునీటి సదుపాయం, కూర్చునే ఏర్పాట్లు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్, ఇతర సర్వీసులను ఆయా స్టేజీల వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తే...

ప్రజల ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం చౌళ్లరామారం స్టేజీ వద్ద నెలకొన్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా సౌకర్యాల కొరతకు అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు ప్రతి గ్రామ పరిసర సమీపంలో ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తే సర్వీస్ రోడ్డు మీదుగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సులు ప్రయాణించడం లేదని ప్రధాన రహదారిపై నిలబడి వేచి చూస్తుంటే ప్రమాదం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని సర్వీస్ రోడ్డు గుండా బస్సులు వెళ్లాలని ఆ దిశగా ఆర్టీసీ డ్రైవర్లకు తెలంగాణ రోడ్డు సంస్థ నుండి ఆదేశాలు జారీ చేయాలని ప్రజల సౌకర్యార్థం ప్రతి స్టేజి వద్ద బస్సులు నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story