రేవంత్.. పోటీకొస్తవా..నువ్వో నేనో తేల్చుకుందాం: ఎంపీ రఘునందన్ రావు

by Prasad Jukanti |   (  Updated:2026-06-06 09:52:17  IST  )

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ విషయంలో కవిత మాటలకు నిప్పులు చెరిగారు.

రేవంత్.. పోటీకొస్తవా..నువ్వో నేనో తేల్చుకుందాం: ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారనే విషయం మరిచిపోవద్దని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సీఎం స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గౌరవప్రదంగా మాట్లాడితే మీకు మాకు గౌరవంగా ఉంటుందన్నారు. అలా కాదని ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడుతారో పోటీ పెట్టుకుందామంటే మేము కూడా రెడీగా ఉన్నామన్నారు. మేము కూడా జై తెలంగాణ అని అన్నవాళ్లమే ఈట్ క జవాబ్ పత్తర్ సే దేంగే అన్నవాళ్లమేనన్నారు. మీరు ఒకటి అంటే మేము నాలుగు అనే స్థానంలో ఉన్నామని కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి గౌరవప్రదంగా మాట్లాడుదామన్నారు. చేతనైతే గణాంకాల మీద చర్చించడానకి ఏ చౌరస్తాకు వస్తారో చెప్పండి మేమూ వస్తామన్నారు. 2014-15 లో వడ్లకు రూ.1300 ఉన్న ఎంఎస్పీ ఇప్పుడు రూ.2300 అయిందని తాము రైతుల కోసం పని చేస్తున్నామని చెప్పడానికి ఇది చాలన్నారు. ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

మొరిగే ప్రతీ కుక్కకు సమాధానం చెప్పనవసరం లేదు:

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ బీజేపీనే విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన వారికి తాము మళ్లీ రామని తెలుసని, అధికారంలో ఉన్నవారికి ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి రామని తెలుసన్నారు. ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మొరిగే ప్రతీ కుక్కకు సమాధానం చెప్పనవసరం లేదన్నారు. ఎన్నికల సంఘం వద్ద 6 వేలకు పైగా రాజకీయ పార్టీలు రిజిస్ట్రర్ అయి ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా కాక్రోచ్ ఎర్త్ వామ్ పార్టీలు వచ్చినా మాకు ఏ సమస్య లేదన్నారు.

రోజా మీకు పెండ బిర్యానీ పెట్టారా?

తెలంగాణలో పవన్ కల్యాణ్ మీటింగ్ పై రద్దాంతం చేస్తున్న కవిత గతంలో బీఆర్ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాల్లో తలదూర్చినప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, పోటీ చేయవచ్చన్నారు. ఆంధ్ర బిర్యానీ పెండ బిర్యానీ అని గతంలో కేసీఆర్ అన్నారు. మరి రోజా ఇంటికి వెళ్లినప్పుడు మీకు ఆమె పెండ బిర్యానీ పెట్టిందా లేక మంచి బిర్యానీ పెట్టిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడితే కరెస్ట్ మిగతా వాళ్లు మాట్లాడితే తప్పు అంటే ఎలా అన్నారు. పవన్ కల్యాణ్ ఆవేశపూరితంగా ఏం మాట్లాడారో నేను వినలేదన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడితే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. వారి ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు అందరికి ప్రమాదం వచ్చినట్లు అనుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు.

Next Story