- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇన్చార్జ్’ మంత్రికి నో ఎంట్రీ..
నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటనలకు జిల్లాలోని సీనియర్ మంత్రుల ఆధిపత్యం అడ్డంకిగా మారింది.

నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటనలకు జిల్లాలోని సీనియర్ మంత్రుల ఆధిపత్యం అడ్డంకిగా మారింది. తమ పెత్తనం తగ్గుతుందనే భయంతో వారు ఇన్చార్జి మంత్రిని రాకుండా అడ్డుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా, జిల్లా మంత్రుల హుకుం వల్ల సమీక్షా సమావేశాలు జరగకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక సామాజిక వివక్ష ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక సమీకరణాల రీత్యా అడ్లూరిని కావాలనే పక్కన పెడుతున్నారని, ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తున్నా ఆయన జిల్లాలో అడుగుపెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నా ఇన్చార్జి మంత్రి జాడ లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. మంత్రుల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరు జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లాకు ఇన్చార్జి మంత్రిని నియమిస్తే ఆ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖల సమీక్ష సమావేశాలు పూర్తిగా ఆ ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పక్షానికి చెందిన మంత్రులు మాత్రం ‘నల్లగొండ.. ఇదీ మా అడ్డా.. మీకేం పని?’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.
మారిన సమీకరణాలు.. దూరమైన ఇన్చార్జి మంత్రి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇన్చార్జి మంత్రుల వ్యవస్థ లేకుండానే పదేళ్లు పాలన సాగింది. అయితే, 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఇన్చార్జి మంత్రిని నియమించారు. తొలుత నల్లగొండ జిల్లాకు సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించగా, ఆయన పర్యవేక్షణలో అభివృద్ధి పనులు, సమీక్షలు చురుగ్గా సాగేవి. ఆయన అనుమతి లేకుండా చిన్న పని కూడా జరిగేది కాదు. అయితే, తుమ్మలను తొలగించి నూతనంగా మంత్రి వర్గంలో చేరిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు జిల్లా బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
అడుగుపెట్టని అడ్లూరి..?
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అధికారిక ఇన్ఛార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియమితులైనప్పటికీ, ఆయన ఒకటి రెండు సార్లు మినహా జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నప్పటికీ ఎక్కడా ఇన్ఛార్జి మంత్రి కనిపించడం లేదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కూడా అడ్లూరి రాకపోవడం గమనార్హం. జిల్లా మంత్రుల అనుమతి లేకుండా అడుగుపెట్టవద్దని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన దేవరకొండ సభకు కూడా ఇన్ఛార్జి మంత్రి గైర్హాజరు కావడం గమనార్హం. నేడు జిల్లా కేంద్రంలో రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన జరుగుతున్నా అడ్లూరి రావడం లేదని సమాచారం.
సీఎం హామీకే దిక్కులేదు!..
దేవరకొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కలను పంపి సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. కానీ రెండు నెలలు గడిచినా ఆ ఊసే లేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా జిల్లా మంత్రుల ఆధిపత్యం ముందు అమలుకు నోచుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పెత్తనం పోతుందనా..? వివక్షనా..?
నిబంధనల ప్రకారం ఇన్ఛార్జి మంత్రి సంతకం లేకుండా అభివృద్ధి నిధులు మంజూరు కావు. అయితే, ఇన్ఛార్జి మంత్రి జిల్లాకు వస్తే తమ పట్టు కోల్పోతామని, అధికారులపై పట్టు సడలుతుందని జిల్లా మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అడ్లూరిని రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు, నల్లగొండ జిల్లాలో ఒక సామాజిక వర్గం ఇతర వర్గాలను అణిచివేస్తోందనే ప్రచారం ఇప్పటికే ఉంది. అదే క్రమంలో సామాజిక సమీకరణాల రీత్యా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై వివక్ష చూపిస్తున్నారనే చర్చ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా జోరందుకుంది. మరి ఈ వివాదంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.






