- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Munugodu: దగా పడుతున్న రైతన్న.. పత్తి కొనుగోళ్లలో సీసీఐ దోపిడీ
రైతులు తాము పండించిన పంట దిగుబడులకు మద్దతు ధర పొందడంలో దగా పడుతున్నారు.

దిశ, మునుగోడు: రైతులు తాము పండించిన పంట దిగుబడులకు మద్దతు ధర పొందడంలో దగా పడుతున్నారు. రాత్రింబవళ్ళు కష్టపడి పంట పండించిన రైతులు యేటా నష్టాలనే మూట గట్టుకుంటున్నారు. నేలతల్లిని నమ్ముకున్న రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను అమ్ముకోవడానికి తెచ్చిన రైతులు తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక నిర్వాహకులు చెప్పిన రేటుకే పత్తిని అమ్ముకొని నష్టపోతున్నారు. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని రైతుల నుంచి ట్రాక్టర్ లోడు 50 కేజీల నుంచి 2 క్వింటాళ్ల వరకు కట్టింగులు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. కొనుగోలు చేసే వ్యాపారులు మాత్రం కాలు కదపకుండా ఉన్నచోటే కోట్లు సంపాదించుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలోని శివరామ(జై బిందు)తో పాటు స్థానికంగా ఉన్న సలాసర్ బాలాజీ కాటన్ మిల్లులలో పత్తి రైతులు దోపిడీకి గురౌతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి అమ్ముకునేందుకు వచ్చిన రైతుల నుంచి నిర్వాహకులు 50 కేజీల నుంచి 2 క్వింటాళ్ల వరకు కోత విధిస్తూ నిట్టనిలువునా ముంచేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతుల పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాలలో గత కొద్ది రోజులుగా నిర్వాహకులను రైతులను దోపిడీ చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
రోజు రోజుకు సీసీఐ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతుండడంతో కొంపల్లి సీసీఐ కోనుగోలు కేంద్రం వద్ద రైతులు తిరుగుబాటుకు చేస్తున్నారు. గత మంగళవారం మిల్లు వద్ద రైతులు ఆందోళన చేపట్టి దాదాపుగా నాలుగు గంటల పాటు కొనుగోళ్లను నిలుపుదల చేసి సీసీఐ నిర్వాహకులను నిలదీశారు. అయినప్పటికి సీసీఐ నిర్వాహకుల తీరు మారడంలేదు. కోతలు మాత్రం యదాతథంగా జరుగుతున్నాయి. సంబందిత అధికారులు సైతం మొక్కుబడిన కేంద్రానికి వచ్చి నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు ఆశ పడి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. అధికారులు వెళ్లిన వెంటనే సీసీఐ నిర్వాహకులు పత్తి కొనుగోళ్లలో కోతలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తమ గోడు వినేవారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కోతలు విధించకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.






