ఆ మండల అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తా.. ఎంపీ ఉత్తమ్

by Disha Web Desk 13 |
ఆ మండల అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తా.. ఎంపీ ఉత్తమ్
X

దిశ, మేళ్లచెరువు: కోదాడ నియోజకవర్గంలో పోటీ చేసిన సమయం నుండి నాకు మేళ్లచెరువు మండల ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉందని నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మేళ్లచెరువు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కొట్టే పద్మ సైడేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేళ్లచెరువు ఉమ్మడి మండలం వెనుకబడిన మండాలమన్నారు. కోదాడ ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేసి మేళ్లచెరువు రూపురేఖలు మార్చానన్ని తెలిపారు. పనికి ఆహార పథకం లో ప్రతి ఒక్కరికి పని భద్రత కల్పించే బాధ్యత ఉందన్నారు చేసిన పనికి 5 ,6 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతానని తెలిపారు.

పాఠశాలలో అందిస్తున్న మిడ్ డే మీల్స్‌లో పిల్లలకు అందించే భోజనం సరైన పోషక ఆహారాలతో అందించాలని ఆయన సూచించారు. ఒక పిల్లవాడికి అందిస్తున్న పైసలతో సరైన పోషక ఆహారాలతో కూడిన ఆహారం అందించడం సాధ్యం కాదని.. పైసలు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో తెల్ల కార్డులకు అందజేస్తున్న బియ్యం ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సామాన్యుడికి అందించవలసిన సన్న బియ్యం అందించలేకపోతున్నారని దొడ్డు బియ్యం సరఫరా చేస్తుంటే వాటిని తినలేక అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదోడికి సన్న బియ్యం అందిస్తా అన్న తెలంగాణ ప్రభుత్వం అందించడంలో విఫలమైందన్నారు.

తాను అధికారంలో లేకపోయినా మేళ్లచెరువు అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నాను. పార్లమెంటు సభ్యుడిగా జగ్గయ్యపేట-నడిపూడి వరకు ప్యాసింజర్ రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్ని అనుమతులు తీసుకొచ్చినట్లు.. త్వరలోనే మేళ్లచెరువు-హైదరాబాద్ వరకు సెటిల్ రైలు నడిపేందుకు అనుమతులు కొరకు ప్రయత్నం చేస్తున్నానని.. మొదలు పెడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ లభించిందని ఆయన వివరించారు.

ఎంపీపీ మాట్లాడుతూ.. పార్లమెంటు సభ్యుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కావడం మండలానికి వివిధ అంగన్వాడీ కేంద్రాలకు, గ్రామ పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గది నిర్మాణాలకు, సీసీ రోడ్ల నిర్మాణం కొరకు ఎంపీ నిధుల నుంచి 59 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు హామీ ఇవ్వడం జరిగిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మ, వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి, ఎమ్మార్వో దామోదర్ రావు, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, పలువురు ప్రజా ప్రతినిధులు సర్పంచులు వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed