నా ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు.. దమ్ముంటే నిరూపించాలి.. ఎమ్మెల్యే సామేల్ సవాల్

by Bhanu |   (  Updated:2025-06-10 11:10:34  IST  )

తన పరువు ప్రతిష్ట,ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేక దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు.

నా ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు.. దమ్ముంటే నిరూపించాలి.. ఎమ్మెల్యే సామేల్ సవాల్
X

దిశ, తుంగతుర్తి: తన పరువు ప్రతిష్ట,ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేక దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. రకరకాల అభియోగాలతో వీడియోలు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనను బ్లాక్ మెయిల్ చేసే వారంతా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. మంగళవారం ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తాను ఏ దందా చేయలేదని, తన దందా అంతా ప్రజా సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు.

ముఖ్యంగా తాను ఎమ్మెల్యేను కాబట్టి నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది వస్తూ పోతుంటారని, ఈ మేరకు వారికి గౌరవమిస్తూ కూర్చోపెట్టి అవసరమైన సమాధానం చెప్తానని తెలిపారు. అదే క్రమంలో వచ్చిన వైన్స్ దుకాణాదారులకు గౌరవంగా చాయ్ ఇస్తే వారు మాత్రం తాను తాగే చాయిలో (టీ) విషం కలిపారని దుమ్మెత్తి పోశారు. ఈ కుట్రలో తీన్మార్ మల్లన్న పాత్ర ఉందని ఆరోపించారు. ఎందుకంటే వీడియో తీసిన వ్యక్తి నేడు తీన్మార్ మల్లన్న చెంతనే ఉన్నారని తెలిపారు.

దళితుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడానికి ఇష్టం లేని వారంతా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని అన్నారు. ముఖ్యంగా నిత్యం సామాజిక న్యాయం అంటూ వేదాలు వల్లించే వారంతా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.వారంతా మందుల సామెల్ అంటే ఏమనుకుంటున్నారో..! ఏమో కానీ దుష్ప్రచారాలు చేస్తే తొక్కి కసరుకక్కిస్తానని మండిపడ్డారు. ముఖ్యంగా తనమీద ఆరోపణ చేసే వారంతా తుంగతుర్తి గడ్డమీద కొచ్చి నిరూపించాలని సవాల్ చేశారు.తనకు డబ్బులు ఎవరిచ్చారో..! చెప్పాల్సి ఉంటుందని సవాల్ చేశారు.

లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుల సామేల్ అనే తాను ఉద్యమకారుడు, నిబద్ధతతో, నీతిగా బతుకుతాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, నాయకులు నరేష్ తదితరులు ఉన్నారు.

Next Story