కేటీఆర్‌తో కుమ్మక్కై దివీస్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చారు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

by Kodari Anjali |

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌తో కుమ్మక్కై ‘దివీస్ ఇండస్ట్రీస్’ ప్రతినిధులు ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు.

కేటీఆర్‌తో కుమ్మక్కై దివీస్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చారు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌తో కుమ్మక్కై ‘దివీస్ ఇండస్ట్రీస్’ ప్రతినిధులు ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చారని, దీనివల్ల చౌటుప్పల్ ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరిగిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. శుక్రవారం భువనగిరి కలెక్టరేట్ లో రైతులతో కలసి కలెక్టర్ అనురాగ్ జయంతినీ కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. చట్టప్రకారం దివీస్ పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపలి వైపు ఉండాల్సి ఉండగా, ఆ పరిశ్రమను కాపాడేందుకు రింగ్ రోడ్డును బయటకు జరిపి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల మున్సిపాలిటీ లిమిట్స్‌లోని రూ. కోట్లలో విలువ చేసే 224 ఎకరాల పేద రైతుల భూములు ఆర్‌ఆర్‌ఆర్‌లో పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీస్ యాజమాన్యంతో మాట్లాడి..

దివీస్ సంస్థ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ధనవంతులైన యాజమాన్యం కలిగిన పెద్ద పరిశ్రమ అని, వారి స్వలాభం కోసం రూట్ మార్చడం వల్ల పేద రైతుల విలువైన భూములు పోతున్నాయి. ఈ విషయమై నేను నేరుగా దివీస్ అధినేత మురళి గారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనూ మాట్లాడతానాని, మీ వల్ల విలువైన భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను దివీస్ యాజమాన్యం ఆదుకోవాలని, నష్టపరిహారం సరిగ్గా వచ్చేలా దివీస్ అధినేతను కలసి స్పష్టంగా అడుగుతాను అని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మున్సిపల్ లిమిట్స్‌లోని భూములకు ఎకరానికి ఏకంగా కోటి నుంచి కోటి 50 లక్షల రూపాయల వరకు పరిహారం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దివీస్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో మాట్లాడి నిర్వాసితులకు అదనపు పరిహారం లేదా లేఅవుట్లలో ప్లాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. “రాబోయే రెండేళ్లలో భూ నిర్వాసితులెవరికీ అన్యాయం జరగకుండా ఏదో ఒక రూపంలో పూర్తి స్థాయి న్యాయం చేస్తా” అని రాజగోపాల్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.

Next Story