గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులపై ఆందోళన అవసరం లేదు : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-10 14:46:02  IST  )

కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న 372 పేద కుటుంబాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నోటీసులు రావడం వెనుక బీఆర్ఎస్ నాయకుల రాజకీయ కుట్ర దాగి ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులపై ఆందోళన అవసరం లేదు : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
X

దిశ‌, కోదాడ : కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న 372 పేద కుటుంబాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నోటీసులు రావడం వెనుక బీఆర్ఎస్ నాయకుల రాజకీయ కుట్ర దాగి ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం అంబటికర్ర శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె, ప్రజలను భయపెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. “నాకు ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునే సమయం ఇది. పేదల ఇళ్లపై కేసులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు విఫలమవుతాయి” అని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. గత రెండు వారాలుగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి నోటీసులు రావడం బాధాకరమని, దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి చెరువులను, ప్రజల భూములను కాపాడలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లాక కోర్టుల అడ్డం పెట్టుకుని పేద కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందనివిమర్శించారు. భయపెట్టడం, బెదిరించడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి కానీ కోదాడ ప్రజలను ఎవ్వరూ భయపెట్టలేరు” అని ఆమె స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల తరఫున గ్రీన్ ట్రిబ్యునల్‌లో కౌంటర్ కేసు వేయడం జరుగుతుందని, ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగనివ్వమని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, తానే స్వయంగా న్యాయ పోరాటంలో ముందుండి నడిపిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. బీఆర్ఎస్ నేతల మాటలకు ప్రజలు మోసపోవద్దని, పదేళ్ల పాలనలో చేసిన మోసాలను గుర్తు పెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని, బీఆర్ఎస్ రాజకీయ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని పద్మావతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కేలన్ ప్రసాద్, 25 వార్డు నాయకులు సయ్యద్ బాబా, పెండం వెంకటేశ్వర్లు, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, కందరబోయిన వీరస్వామి, అంబటి కర్ర వెంకటేష్, అంబటికర్ర వెంకన్న పాల్గొన్నారు.

Next Story