- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే
దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే అన్నారు.

దిశ, దేవరకొండ టౌన్: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో ఆయన 'మార్నింగ్ వాక్ విత్ పీపుల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని 20వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వార్డులోని స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించడంతో పాటు, ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా వార్డులో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే.. వారికి వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా...
అలాగే వార్డులోని మురికి కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించి, పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి వెంటనే శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను సూచించారు. కేవలం ఒక వార్డుకే పరిమితం కాకుండా మున్సిపాలిటీ మొత్తం పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నగరాభివృద్ధి నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పున్న శైలజ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, స్థానిక కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






