- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ నుంచి యూపీఎస్‌సీ వరకు.. కుటుంబాలపై రూ.3.5 లక్షల కోట్ల భారం: రాహుల్ గాంధీ కీలక డేటా!
దేశంలో విద్యార్థుల కుటుంబాలపై పోటీ పరీక్షల నిర్వహణ, ప్రిపరేషన్ల పేరిట భారీగా ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో విద్యార్థుల కుటుంబాలపై పోటీ పరీక్షల నిర్వహణ, ప్రిపరేషన్ల పేరిట భారీగా ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, నీట్ (NEET) నుంచి యూపీఎస్‌సీ (UPSC) వరకు వివిధ పోటీ పరీక్షల కోసం దేశంలోని కుటుంబాలు ఏటా ఏకంగా రూ.3.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయని కీలక వివరాలు వెల్లడించారు. ఈ దోపిడీ వ్యవస్థ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, ఇది దేశ ప్రజలకు జరుగుతున్న పెద్ద అవమానమని ఆయన విమర్శించారు.
నీట్ పరీక్షకే రూ.1.32 లక్షల కోట్లు
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్ష ప్రిపరేషన్ కోసం వారి కుటుంబాలు రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తం విద్యా రంగానికి కేటాయించే బడ్జెట్ (సుమారు రూ.1.4 లక్షల కోట్లు) ఈ ఒక్క పరీక్ష కోసం ప్రజలు పెట్టే ఖర్చుకు సమానంగా ఉండటం గమనార్హం. ఎస్‌ఎస్‌సీ (SSC), యూపీఎస్‌సీ (UPSC), జేఈఈ (JEE), ఆర్‌ఆర్‌బీ (RRB), నీట్ (NEET) వంటి ఐదు ప్రధాన పరీక్షల కోసం కుటుంబాలు కలిపి రూ.3.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి.’ అని తెలిపారు. ఈ ఐదు పరీక్షల కోసం ప్రజల జేబుల నుంచి వెళ్తున్న రూ.3.5 లక్షల కోట్ల మొత్తం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్య, ఆరోగ్యం, కార్మిక, సైన్స్, మహిళా-శిశు అభివృద్ధి శాఖల సంయుక్త బడ్జెట్‌తో సమానమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
‘తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాలను కరిగిస్తూ, అప్పులు చేస్తూ ఈ ఖర్చులను భరిస్తున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ఆదుకునేలా కాకుండా, కేవలం డబ్బులు వసూలు చేసే ఒక ‘దోపిడీ యంత్రాంగం’లా (Extortion Mechanism) మారిపోయింది.’ అని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






