వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

by velandi.Saikiran |

నరేష్ చారి అనే వ్య‌క్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
X

దిశ,గద్వాల క్రైం : ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నరేష్ చారి అనే వ్య‌క్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి నరేష్ చారి హ‌ల్ చ‌ల్ చేశాడు. ఈ త‌రుణంలోనే రంగంలోకి దిగిన‌ గద్వాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. శ్రీను, హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.

ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. తన భార్యకు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బాలు నాయుడుతో అ*క్ర‌మ సంబంధం ఉందని, దీనివల్ల తన కుటుంబం రోడ్డున పడిందని బాధితుడు నరేష్ చారి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై గతంలోనే పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురై, చివరికి ఆత్మహత్యే మార్గమని భావించి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నరేష్ చారి తెలిపాడు.

సీఐ కౌన్సిలింగ్‌తో ఉత్కంఠకు తెర

సమాచారం అందుకున్న గద్వాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. శ్రీను వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ పైనున్న నరేష్ చారితో ఫోన్ ద్వారా మాట్లాడి, అతనికి ధైర్యం చెప్పారు. బాధితుడికి తప్పకుండా న్యాయం చేస్తామని, విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. సీఐ ఇచ్చిన హామీతో నరేష్ చారి వాటర్ ట్యాంక్ దిగి వ‌చ్చాడు.

Next Story