- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం..
వర్షాలు లేక రైతులంతా శ్రీఆర్డిఆర్ ఎస్సారెస్పీ రెండో దశకు ఎదురుచూస్తున్నారు.

దిశ, తుంగతుర్తి: ఎక్కడ కనిపిస్తున్న విధంగా ఎండిపోతున్న పొలం... ముదిరిపోతున్న వరి నారు చిత్రాలన్నీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం, తుంగతుర్తి గ్రామ రైతులవి. ఎన్నో ఆశలతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వీరంతా వరి పంటల సాగుకు పూనుకున్నారు. అయితే 15 రోజులు గడవకముందే నీళ్లు లేక బీటలుబారి ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అలాగే నాట్లు వేయడానికి ముందే మురిసిన రైతులు తరువాత నీళ్లు లేకపోవడంతో సాగుపై ఆశలు వదులుకొని నారునంత వదిలి పెట్టేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇలాంటి చిత్రాలు కనిపిస్తుంటాయి. మొన్నటి రబీ సీజన్ వరకు వివిధ రకాల పంటల సాగుతో కళకళలాడిన పంటల సాగు నేడు ప్రశ్నార్థకంగా మారింది.ఈ ఖరీఫ్ సీజన్ లో ఏర్పడ్డ పరిస్థితులు పంటల సాగుకు గొడ్డలిపెట్టుగా మారాయి. ప్రధానంగా వరి పంట సాగుపై రైతాంగం ఎటూ తేల్చుకోలేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. వర్షాలకు తోడు ఎప్పటి మాదిరిగానే శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ (శ్రీ ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి )రెండో దశ నీళ్లు వస్తాయో..? లేక రావో...? అనే పరిస్థితులు నెలకొన్నడమే రైతుల గందరగోళానికి కారణమైంది.ముఖ్యంగా ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ వస్తుందంటేనే రైతుల్లో ఉత్సాహం మొదలవుతుంది.ఎందుకంటే రబీలో కంటే ఖరీఫ్ సీజన్ లోనే పంటల సాగు ఎక్కువగా ఉండి రైతులకు లాభదాయకంగా మారుతుంది.
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే
అందుకు అనుగుణంగానే వరి పంట సాగుకు అవసరమైన కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా రైతాంగం ఉంటుంది.ఈ లెక్కన నియోజకవర్గంలోని తిరుమలగిరి, గారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో మొత్తంగా కలిపి లక్ష ఎకరాల్లో వరి పంట సాగువుతోంది. అయితే ఈసారి ఇప్పటివరకు దాదాపు 30 వేల లోపే వరి పంట సాగయినట్లు అధికార వర్గాల లెక్క. దీనికి తుంగతుర్తి మండలాన్ని లెక్కలోకి తీసుకుంటే... మండలంలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి దాదాపు 25 వేల ఎకరాల పైన సాగు ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కేవలం 4 వేల 400 ఎకరాలు మాత్రమే రైతులు సాగు చేశారు. అలాగే మరో 18 వేల ఎకరాలలో సాగు చేయడానికి నారు సిద్ధంగా ఉంది.అయితే ఈ నార్లు కూడా ఇప్పటికే ముదిరిపోయాయి. ఈ మధ్యకాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే దీన్ని సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇక వరి సాగులో మండలాల పరంగా చూస్తే ప్రతి మండలంలో 20వేల ఎకరాలపైనే ఉంటుంది. ఇందులో అత్యధికంగా తుంగతుర్తి మండలంలోనే. ఇక పత్తి పంట సాగు విషయానికి వస్తే అది కూడా గతంలో కంటే ఈసారి తక్కువ విస్తీర్ణంలో సాగయింది. ముఖ్యంగా అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులతో ఆరుతడి పంటలే వేయాలంటూ ఓవైపు అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ రైతాంగం మాత్రం పూర్తిస్థాయిలో సుముఖంగా లేదు. ఎందుకంటే మొదటినుండి వరి పంట పైనే దృష్టి సారిస్తున్న రైతాంగం ఈసారి కూడా పరిస్థితులు అనుకూలించక పోతాయా...? అనే మీమాంసలో ఉంది.
శ్రీ ఆర్డిఆర్ ఎస్సారెస్పీ రెండో దశపైనే రైతుల ఆశలు
2009లో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లాకు శ్రీరాంసాగర్ రెండో దశ నీళ్లు(గతంలో ఎస్సారెస్పీ, ప్రస్తుతం శ్రీఆర్డిఆర్ ఎస్సారెస్పీ) విడుదలయ్యాయి.అనంతరం పలు కారణాల చేత కొన్ని మార్లు నిలుస్తూ మళ్లీ రావడం లాంటివి జరిగాయి.చివరికి 2018 నుండి నిరాటంకంగా ఖరీఫ్, రబీ సీజన్ లకు నీళ్లు వస్తున్నాయి.అయితే ఈసారి వాతావరణ పరిస్థితులన్నీ తిరగబడడంతో వర్షాలు లేక రిజర్వాయర్లన్నీ అడుగంటి పోయాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు కాలువల ద్వారా నీళ్లు రావాలంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 24.034 టీఎంసీల సామర్ధ్యం కలిగిన లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండి) శరణ్యం.అక్కడి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో 0.867 టీఎంసీల సామర్థ్యం కలిగిన మైలారం బ్యాలెన్సింగ్ లోకి వస్తాయి. ఇక్కడి నుండి జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో0.480 టీఎంసీల సామర్థ్యం కలిగిన బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి వస్తాయి.అనంతరం అక్కడి నీటి సామర్థ్యాన్ని బట్టి సూర్యాపేట జిల్లాకు కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి.అయితే ప్రస్తుతం రిజర్వాయర్లలో ఏమాత్రం కూడా చెప్పుకో తగ్గ రీతిలో నీళ్లు లేవు.ఎల్ఎండిలో ప్రస్తుతం 5.517 టీఎంసీలు,మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 0.304,బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 0.297 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వగా ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో నీటి విడుదల ఏమాత్రం సాధ్యం కాదు.మున్ముందు పుష్కలంగా కురిసే వర్షాలు,ఎల్ఎండి పై భాగంలో జరిగే ప్రభావాలతోనే నీళ్లు రావచ్చనేది అంచనా.
పత్తి పంట నిలిచేనా...?
వరి పంట సాగు చేసే విషయంలో రైతాంగం సందిగ్ధంగా కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు పత్తి పంట విషయంలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. సాగు చేసిన పత్తి చివరి వరకు నిలిచేనా....? లేక మధ్యలోనే దెబ్బతినేనా...? అనే ప్రశ్నలు వారిలో తలెత్తుతున్నాయి. ఎందుకంటే..? నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమంది రైతులు బోరు, బావులు ఆధారంగా పత్తి పంట సాగు చేస్తారు. మరి కొంతమంది వర్షాలు, కాలువ నీటిపై ఆధారపడతారు.అయితే మారిన పరిస్థితులతో కాలువ నీళ్లు రాకపోవడం, వర్షాలు వస్తాయనే గ్యారెంటీ లేకపోవడం లాంటి పరిస్థితులకు రైతాంగంలో సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలాయి.






