అమ్మేవారికి కాసులుకొనేవారికి కష్టాలు!

by velandi.Saikiran |

సూర్యాపేట ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు సాగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

అమ్మేవారికి కాసులుకొనేవారికి కష్టాలు!
X

అమ్మేవారికి కాసులుకొనేవారికి కష్టాలు!

=అనుమతులు లేకుండా వెంచర్….

=పంట కాలువను పూడ్చి ప్లాట్ల విక్రయం…

=అధిక లాభాల ఆశతో నియమ నిబంధనలు పక్కకు..

=అమాయక ప్రజలను ఆకర్షించేందుకు తక్కువ ధరలు...

=పట్టించుకోని సంబంధిత శాఖ ల అధికారులు;

దిశ సూర్యాపేట: సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు సాగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంబంధిత శాఖల అధికారుల అనుమతులు తీసుకోకుండా, నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి వెంచర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ఒక వెంచర్ ఏర్పాటు చేసి, పంట సాగుకు ఉపయోగపడే కాలువను పూడ్చివేసి ప్లాట్లుగా మార్చిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూర్యా పేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డు జనగాం ఎక్స్ రోడ్డు నుంచి పిల్లలమర్రి కి వెళ్ళే మార్గ మధ్య డొంక దారిలో సర్వే నెంబర్ 212, 143, సుమారు మూడు ఎకరాల 20 గుంటలు భూమి లో మట్టి పోసి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేశారు. రైతులకు ప్రాణాధారంగా ఉన్న పంట కాలువను మట్టితో నింపి, దాని పైగా రోడ్లు వేస్తూ ప్లాట్లు కట్ చేసి విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎలాంటి అనుమతులు లేకుండానే ...

వెంచర్ లో మట్టి పోసి, సంబధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్ చేశారు. వెంచర్ నిర్వాహకులు అధిక లాభాల ఆశతో నియమ నిబంధనలు పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా ప్లాట్లు విక్రయిస్తున్నారనీ ఆరోపణలు ఉన్నాయి. అమాయక ప్రజలను ఆకర్షించేందుకు తక్కువ ధరలు, సులభమైన వాయిదా పద్ధతులు చూపిస్తూ కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పంట కాలువ పూడ్చివేయడంతో...

పంట కాలువ పూడ్చివేయడంతో సమీప రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువను తిరిగి పునరుద్ధరించాలని, అక్రమంగా చేపట్టిన వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు, అనుమతులేని వెంచర్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లేఔట్ లేని ప్లాట్లను కొనుగోలు చేయవద్దు..

అనుమతి లేని వెంచర్ ల పై విచారణ చేపడతాం...

సూర్యా పేట మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి;

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని అనుమతి లేని వెంచర్ ల పై విచారణ చేపడతాం, ప్రజలు అనుమతి లేని లేఔట్ ప్లాట్లను కొనుగోలు చేయవద్దు. లేఔట్ లేని ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. బ్యాంకు నుంచి రుణం లభించదు. డబుల్ టాక్స్ పడుతుంది. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు చేపడతం.

Next Story