నిబంధనలు లేవని నిర్భయంగా గ్యాస్ దందా

by Bhanu |

గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు భూదాన్ పోచంపల్లి మండలంలో పక్కదారి పడుతున్నాయి.

నిబంధనలు లేవని నిర్భయంగా గ్యాస్ దందా
X

దిశ, భూదాన్ పోచంపల్లి: గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు భూదాన్ పోచంపల్లి మండలంలో పక్కదారి పడుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే సబ్సిడీ గల వంటగ్యాస్‌ను కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ లో కొనుగోలు చేసి తమ వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో పట్టణంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, బిర్యాని హోటళ్లలో ఎక్కడ చూసినా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే కనిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ నిర్భయంగా ఈ సిలిండర్లను వాడుతున్నా, పట్టించుకునే నాధుడే లేకపోయిన పరిస్థితి నెలకొంది. కళ్లముందే ఈ అక్రమ గ్యాస్ దందా జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తూ మామూళ్ల మత్తులో మునిగిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


కమర్షియల్ గ్యాస్ ధరతో పోల్చితే డొమెస్టిక్ సిలిండర్లు తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో వ్యాపారులు వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. డెలివరీ బైళ్లు ప్రధాన సరఫరాదారులుగా మారి ఒక్కో సిలిండర్‌కు రూ.200 నుంచి రూ.400 వరకు అదనంగా తీసుకుని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ వినియోగాన్ని నిరోధించాల్సిన అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. మరింతగా, ఈ అక్రమ దందాను నిర్వహించే గ్యాస్ ఏజెన్సీలు తమ వాహనాలపై ఏజెన్సీ పేర్లేమీ లేకుండా తరలింపు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story