దేవరకొండలో ఘోరం.. మృతదేహాన్ని పీక్కతిన్న కుక్కలు-పందులు

by Kodari Anjali |

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్‌లో ఒక అత్యంత విషాదకరమైన, ఘోర సంఘటన వెలుగుచూసింది.

దేవరకొండలో ఘోరం.. మృతదేహాన్ని పీక్కతిన్న కుక్కలు-పందులు
X

దిశ, దేవరకొండ టౌన్: నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్‌లో ఒక అత్యంత విషాదకరమైన, ఘోర సంఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధుడు మరణించగా, గమనించే వారు ఎవరూ లేకపోవడంతో కుక్కలు, పందులు ఆయన మృతదేహాన్ని పీక్కుతిన్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన రాజగోపాల్ రెడ్డి (80) అనే వృద్ధుడికి పెళ్లి కాలేదు. ఆయనకు ఎవరూ లేకపోవడంతో గత కొంతకాలంగా ఇంట్లో ఒంటరిగానే నివసిస్తున్నారు. ఆయన అన్నదమ్ముల కుటుంబాలు విదేశాలలో (అబ్రాడ్) స్థిరపడ్డాయి. దీంతో ఆయనతో స్థానికంగా ఉండేందుకు కుటుంబ సభ్యులెవరూ లేరు.

ఇంట్లోకి చొరబడిన కుక్కలు..

రాజగోపాల్ రెడ్డి దాదాపు పది రోజుల క్రితమే ఇంట్లో మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఒంటరిగా ఉండటం, ఇరుగుపొరుగు వారు కూడా గమనించకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. కాగా, ఇంట్లోకి చొరబడిన కుక్కలు వృద్ధుడి శవాన్ని పూర్తిగా తినేశాయి. చివరకు కేవలం అస్థిపంజరం (బొక్కలు) మాత్రమే మిగిలింది. ఇంటి నుండి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి పోలీసులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

Next Story