రైతన్న, నేతన్న ప్రభుత్వానికి రెండు కళ్ళు : మంత్రి తుమ్మల

by Bhanu |

రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

రైతన్న, నేతన్న ప్రభుత్వానికి రెండు కళ్ళు : మంత్రి తుమ్మల
X

దిశ,భూదాన్ పోచంపల్లి: రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక పద్మశాలి సభా వేదిక వద్ద ఇక్కత్ పరిశ్రమపై చేనేత సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత ఇక్కత్ పరిశ్రమపై చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చేనేత సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి అర్బన్ బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా 11 బ్రాంచ్ లతో సుమారు 400 కోట్ల టర్నోవర్ చేయడం గొప్ప విషయమని, రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు విస్తరించాలని కోరారు. ప్రభుత్వపరంగా బ్యాంకుకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి చేనేత కార్మికులకు వచ్చే ప్రతి పథకాన్ని అమలు అయ్యే విధంగా పోరాడుతానని హామీ ఇచ్చారు. గత పది ఏండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, సంవత్సరానికి 6000 కోట్లకు పైగా వడ్డీలు కడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు 1000 కోట్లు కేటాయించిందన్నారు. పోచంపల్లి అంటేనే చేనేత అని, ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరొందిందని, ఐ ఐ హెచ్ టి కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టే విధంగా చూస్తామన్నారు. అదేవిధంగా రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని,రైతాంగానికి 35వేల కోట్లు మంజూరు చేశామన్నారు.రైతులకు మాదిరిగానే నేతన్నకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రతి నేతన్నకు లక్ష రూపాయల రుణమాఫీ త్వరలోనే అమలవుతుందని, నేత భరోసా 18 వేల రూపాయలు, సహాయకునికి 9000 ఇస్తామన్నారు. అదేవిధంగా నేత బీమా 5 లక్షల రూపాయలను వయో పరిమితి లేకుండా ఇస్తున్నామని తెలిపారు.

అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి కార్మికులకు రావలసిన పథకాలను, నిధులను గురించి కేంద్ర మంత్రులతో పార్లమెంటులో చర్చించి సాధిస్తానన్నారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేనేత రుణమాఫీకి ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసిందని, మరో రెండు నెలల్లో సర్వేను పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పోచంపల్లి ప్రాంతానికి ఒక చరిత్ర ఉందని, భూదానోద్యమం ఇక్కడినుండే ప్రారంభమైందని, ఈ మధ్యకాలంలో భూదానోద్యమ వజ్రోత్సవాలు జరుపుకున్నామని, 2004లో రాజశేఖర్ రెడ్డి హయాంలోనే చేనేతలకు రుణమాఫీ జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చేనేత జౌళి శాఖ రాష్ట్ర అధ్యక్షులు మురళి, చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జాయింట్ డైరెక్టర్ ఇందుమతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావు,పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేష్, చేనేత రాష్ట్ర నాయకులు తడక వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, ఉప్పునూతల వెంకటేశ్ యాదవ్, అంకం పాండు తదితరులు పాల్గొన్నారు .


Next Story