- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల ఇబ్బందులకు ప్రభుత్వ వైఫల్యాలే కారణం..
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు ప్రకృతి కారణాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు.

దిశ, నడిగూడెం: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు ప్రకృతి కారణాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. గురువారం నడిగూడెం మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు, పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అప్రమత్తం కాలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదని, రైతులపై అసలు శ్రద్ధ లేదని విమర్శించారు. కరువు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, విత్తనాల లభ్యత, భూగర్భ జలాల పరిరక్షణ, చెరువుల నిర్వహణ వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం నీటి వినియోగంలో వైఫల్యం, రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతు భరోసా అందించడంలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేలుకోల్పడానికే తాము రోడ్లపైకి రావాల్సి వస్తుందని, సబ్ స్టేషన్ లో ఎదుట బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. ఈ సీజన్‌లో పంటలు సాగు చేయలేక నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల కరువు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ తో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, సాగుకు అవసరమైన విద్యుత్ సరఫరాపై చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని బొల్లం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సమన్వయకర్త ఆంజనేయులు, నాయకులు గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉపేందర్, నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు ఉపేందర్, మాజీ సర్పంచ్ సుధాకర్, జలీల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






