రీల్స్ బాగా చేస్తేనే ఫేమ్ అని తలచి.. గంజాయి వ్యాపారంలోకి..!

by Bhanu |

సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలని, తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో యువత చెడు మార్గాన్ని

రీల్స్ బాగా చేస్తేనే ఫేమ్ అని తలచి.. గంజాయి వ్యాపారంలోకి..!
X

దిశ, నార్కట్ పల్లి/ నల్లగొండ : సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలని, తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో యువత చెడు మార్గాన్ని ఎంచుకుంటున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. గంజాయి వ్యాపారంతో పాటు రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తూ వచ్చిన ఓ ముఠాను నార్కట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి సుమారుగా రూ. 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి, నగదు, గంజాయి మరియు ఒక బైక్‌ను రికవరీ చేశారు. అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మహిళ ఉన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన బాజపల్లి జోసఫ్, ఎరిక్ విల్సన్ మెరీనా, బోస్, ఒడిశాకు చెందిన మాలిక్, ఇద్దరు మైనర్ బాలురు కలిసి ఓ ముఠా ఏర్పరచుకొని గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటగా వారు రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి, దాన్ని సరఫరా చేసేందుకు అనువైన ప్రాంతంగా నార్కట్‌పల్లి మండలాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో బంధువుల ద్వారా ఒకరికి పరిచయం ఉండటంతో, ఇక్కడకు చేరుకొని గంజాయి విక్రయం ప్రారంభించారు.

అంతే కాకుండా, రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడేందుకు ప్రత్యేకంగా పథకం రూపొందించారు. గ్రామ శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ వెనుక ఉన్న చోట ముఠా కార్యకలాపాలు కొనసాగుతుండగా, ఆ సమాచారం ఆధారంగా పోలీసులు ఆదివారం ఉదయం ముఠాను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు గంజాయి సేవించడమే కాకుండా, ఎవరైనా అడ్డొస్తే దాడులకు దిగేందుకు మారణాయుధాలు కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ముఠా నుంచి 17 తులాల బంగారం, 79 తులాల వెండి, రూ. 50 వేల నగదు, రెండు కిలోల గంజాయి, ఒక పల్సర్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నార్కట్‌పల్లి, జవహర్‌నగర్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై డి. క్రాంతికుమార్, సిబ్బంది ఆంజనేయులు, రాము, సత్యనారాయణ, హరిప్రసాద్, శివశంకర్, తిరుమల్, కృష్ణ, మహేష్‌ల సాయంతో ఛేదించబడింది. వారిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలపై ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.


Next Story