బ్యాటరీ కంపెనీలో దొంగల ముఠా గుట్టురట్టు..

by Kodari Anjali |

బ్యాటరీ కంపెనీలో దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బ్యాటరీ కంపెనీలో దొంగల ముఠా గుట్టురట్టు..
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు పెద్దలు. కానీ ఇక్కడ ఆ సామెత తలకిందులైంది. కంపెనీలో పని చేసే సూపర్వైజర్ లే దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి ఆకాష్ మెటల్ ఇండస్ట్రీస్ బ్యాటరీ కంపెనీలో ఆదివారం చోటుచేసుకుంది. కంపెనీ యజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాటరీ కంపెనీలో సూపర్వైజర్లుగా పని చేస్తున్న నల్లగట్ల శశి కుమార్, రాపోలు భాస్కర్ లు ఇద్దరు ఒక్కటై సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వారి కింద పనిచేసే కార్మికులను లోబరుచుకొని కంపెనీకి విలువైన సీసం దిమ్మెలను (లీడ్ బార్) లను రహస్యంగా కంపెనీ ప్రహరీ గోడ బయటకి విసిరేశారు.

ఎంత సమయం గడిచిన రాకపోవడంతో..

ఆ తర్వాత వాటిని ఆటోలో లోడ్ చేసుకుని బయట అమ్ముకునేవారు. గత రెండు, మూడు నెలలుగా కంపెనీ స్టాక్ లో తేడా వస్తుందని, ఇప్పటివరకు సుమారు 25 మెట్రిక్ టన్నుల సీసం దిమ్మెలు కనబడకుండా పోయినట్లు గుర్తించామని కంపెనీ యజమాన్యం తెలిపారు. వాటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులు మూత్ర విసర్జనకని వెళ్లి ఎంత సమయం గడిచిన రాకపోవడంతో అనుమానం వచ్చి వారు వెళ్లిన ప్రదేశం వైపు వెళ్లి చూడగా ప్రహరీ గోడ బయట ఉన్న సీసం దిమ్మెలను చూసి ఆశ్చర్యపోయారు. తక్షణమే స్పందించిన కంపెనీ యజమాన్యం తమదైన శైలిలో విచారించగా సూపర్వైజర్లు నల్లగట్ల శశికుమార్, రాపోలు భాస్కర్లు చెబితేనే చేశామని కార్మికులు చెప్పడంతో సూపర్వైజర్లను యజమాన్యం గట్టిగా మందలించడంతో తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు..

ఈ చోరీ ఘటనపై కంపెనీ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. కంపెనీలో పనిచేసే ఇద్దరు సూపర్వైజర్ లను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ ముఠా వెనుక ఇంకెవరెవరీ హస్తం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కంపెనీ యజమాని పార్ట్నర్ పాలోజు రాజశేఖర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.

Next Story