బిఎల్ఓతో పాటు ప్రతి ఇల్లు తిరగాలి: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

by Kodari Anjali |

గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ లు ప్రతి రోజు BLO తో పాటే ఇల్లులు తిరుగుతూ అన్ని పరిశీలించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

బిఎల్ఓతో పాటు ప్రతి ఇల్లు తిరగాలి: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, నల్లగొండ బ్యూరో: గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ లు ప్రతి రోజు BLO తో పాటే ఇల్లులు తిరుగుతూ అన్ని పరిశీలించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సర్ (ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన), పార్టీ సభ్యత్వ నమోదుపై నల్లగొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి ఓట్లు కాపాడేలా పకడ్బందీగా పని చేయాలన్నారు. కార్యకర్తలు ఎక్కడ గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. అనుమానం వస్తే వెంటనే ఆర్డీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలన్నారు. నల్గొండలో ఈ నెల 17 నాడు పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్ నల్గొండకు వస్తున్నాడని తెలిపారు. హ్యాం రోడ్లు అన్ని వట్టిదే.. హంభాక్... కమిషన్ లు కొరకే హంగామా.. ఈ కోతల వెంకట్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని తెలిపారు. ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. అందుకే హ్యాం రోడ్లు అంటూ నానా ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. సీఎం ఇప్పటివరకు నల్గొండ జిల్లాకు ఒక్కరూపాయి ఇవ్వలేదని, జిల్లా మంత్రులు ఇద్దరు అసమర్థులే... జిల్లాలో అభివృద్ధి కనపడటం లేదని పెర్కొన్నారు. కేసీఆర్ వచ్చిన ప్రతిసారి నల్గొండను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని మెడికల్ కాలేజీలు, భగీరథ పథకం, రూ.1300 కోట్లతో నల్గొండ పట్టణం అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.

మనం జాగ్రత్తగా లేకపోతే తెలంగాణలో..

ఇద్దరు మంత్రులు స్కామ్ లు చేస్తూ పబ్బమ్ గడుపుతున్నారని విమర్శించారు. మిల్లర్ల వద్ద మూడుపులు ఈ దుర్మార్గులు తీసుకున్నారని అన్నారు. పోయేలా ఉన్న మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఈ జిల్లా మంత్రి రేవంత్‌ను కాకా పెట్టేందుకు సభ పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. తన తమ్ముడికి పదవి వచ్చి తన పదవి పోయేలా ఉందని.. అందుకే ఈ కోతల వెంకటరెడ్డి హడావుడి చేస్తూ షో పుటప్ చేస్తుండని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లనే ఇటీవల పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లు తొలగించారని, తద్వారా అక్కడ బలమైన పార్టీలను ఓడించి కేంద్రంలో అధికారంలో ఉన్న అన్నారు. మనం జాగ్రత్తగా లేకపోతే తెలంగాణలో కూడా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. దేశ మాజీ కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఓటు కూడా గల్లంతు అయ్యిందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఏలు అప్రమత్తంగా లేకపోతే ఇలాగే మన ఓట్లు కూడా రేపు గల్లంతు కాకుండా ఉండాలంటే గ్రామ స్థాయిలో బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నల్ల కోటు వేసుకొని కోర్టులో వాదనలు వినిపించినా ఓటరు జాబితాను మార్చలేకపోయారని గుర్తుచేశారు.

ఎస్ఐఆర్ చాలా ముఖ్యమైంది..

భారత రాజ్యాంగం ఆధారంగా ఎన్నికల కమీషన్‌కు ఆర్టికల్ 324 ప్రకారం.. కల్పించిన అధికారాలు ఎవరూ ప్రశ్నించలేరని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను నమ్మి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తే, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ తిరస్కరించారని, సుప్రీం కోర్టు కూడా రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని తప్పుబట్టలేదన్నారు. కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే సుమారు 2 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి పార్టీ సేవా మిత్ర యాప్ ద్వారా వైసిపి పార్టీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తే, కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని వివరించారు. అందుకే ఎస్ఐఆర్ చాలా ముఖ్యమైందని అర్హులైన ఓట్లు ఒక్కటి కూడా తప్పిపోకుండా చూడాలన్నారు. చాలా దేశాల్లో ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఓటు హక్కు లభించిందని, అమెరికాలో కూడా ఇప్పటికీ కొందరు నల్ల జాతీయులకు ఓటు హక్కు లేదని, భారత దేశంలో మాత్రం అంబేడ్కర్ దార్శనికత వల్ల అందరికీ సమాన ఓటు హక్కు లభించిందని కొనియాడారు.

మీ ఓటు హక్కు ఉందా లేదా ..?

బూత్ లెవల్ ఆఫీసర్స్ తో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొని ఆధార్ లేదా ఇతర గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలు చూపించి ఎన్యుమరేటర్ ఫాం నింపాలన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం 6, చనిపోయిన లేదా అందుబాటులో లేని ఓట్లు తొలగించడానికి ఫారం 7 మరియు అభ్యంతరాలు లేదా సవరణల కోసం ఫారం 8 నింపి ఇవ్వాలన్నారు. ఇసిఐ నెట్ ద్వారా స్థానిక బిఎల్ఓ వివరాలు, మీ ఓటు హక్కు ఉందా లేదా? అనే సమాచారం తెలుసు కోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నగరం పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాల నుంచి తరలివచ్చిన బూత్ లెవల్ పార్టీ ఏజెంట్ లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story