మర్డర్స్ కేరాఫ్ సూర్యాపేట.. మే నెలలోనే 5 హత్యలు

by Ajay Maddhiboyina |

సూర్యాపేట జిల్లాలో రోజురోజుకు హత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత కక్షలు, రాజకీయ విభేదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు హత్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

మర్డర్స్ కేరాఫ్ సూర్యాపేట.. మే నెలలోనే 5 హత్యలు
X

దిశ, నల్గొండ బ్యూరో / హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లాలో రోజురోజుకు హత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత కక్షలు, రాజకీయ విభేదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు హత్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లడం వల్ల అనేక కుటుంబాలు నిలువునా దెబ్బతింటున్నాయి. ఇటీవల నమోదైన హత్యలలో ఎక్కువ భాగం సూర్యాపేట పోలీస్ సర్కిల్ పరిధిలోనే చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.ఇంత జరుగుతున్నా పోలీసుల నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోందనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు గ్రామ స్థాయిలో విలేజ్ పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ నేరాలు అరికట్టలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మధు హత్యతో పోలీసులపై భిన్నాభిప్రాయాలు

యర్కారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక పికెటింగ్ నిర్వహిస్తూ, గ్రామ పరిస్థితులపై నిత్యం ఆరా తీస్తున్నప్పటికీ ఈ ఘటన జరగడం ప్రజలను కలవరపరిచింది.గ్రామంలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిసినా, ప్రత్యర్థి వర్గాల కదలికలపై పోలీసులు సమర్థంగా నిఘా పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హత్య తర్వాత పోలీసుల పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

“నిఘా వ్యవస్థ ఎక్కడ?” అంటూ ప్రజల ప్రశ్న

సూర్యాపేట జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా యర్కారం గ్రామం రాజకీయ, వ్యక్తిగత కక్షల హత్యలకు కేంద్రంగా మారింది. కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల సమయంలో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్యకు గురయ్యారు. అనంతరం వడ్డే ఎల్లయ్య, తాజాగా చింతలపాటి మధు హత్యలు చోటుచేసుకున్నాయి.ఇందులో వడ్డే ఎల్లయ్య, చింతలపాటి మధుపై గతంలోనే పలు కేసులు నమోదై ఉండటంతో పాటు రౌడీషీట్లు కూడా ఉన్నాయని సమాచారం. ఇలాంటి వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఈ హత్యలకు కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ స్థాయిలో విలేజ్ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఉన్నప్పటికీ నేరాల నియంత్రణలో విఫలమవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నేరస్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందని, అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

గత నాలుగేళ్ల హత్యల గణాంకాలు

సూర్యాపేట జిల్లాలో గత నాలుగేళ్లుగా హత్యల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.

2023లో – 22 హత్యలు

2024లో – 20 హత్యలు

2025లో – 18 హత్యలు

2026 జనవరి నుంచి మే వరకు – 6 హత్యలు నమోదైనట్లు సమాచారం.

ఈ 6 హత్యలు ఇవే..

గత వారం రోజుల్లోనే సూర్యాపేట మండలంలో రెండు హత్యలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ ఏడాది నమోదైన ప్రధాన హత్యలు

1.యర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు కుటుంబ తగాదాల నేపథ్యంలో హత్యకు గురయ్యారు.

2.సోలిపేట గ్రామానికి చెందిన మేకల జయరాములు హత్య చేయబడ్డారు.

3.ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌కు చెందిన సురిగి అంజమ్మను ఆస్తి వివాదంలో సొంత సోదరుడే హత్య చేశాడు.

4.కోదాడ పట్టణంలో బత్తుల శిరీషను భర్త మణిదీప్ అనుమానంతో హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

5 సూర్యాపేట పట్టణం మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ కులాంతర వివాహం చేసుకున్న కారణంగా భార్య కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

6.కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్‌ను వ్యక్తిగత కక్షలతో స్నేహితుడే హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది.

నేర నియంత్రణపై పెరుగుతున్న ఆందోళన

జిల్లాలో వరుస హత్యలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో భద్రతాభావం తగ్గుతోంది. పోలీస్ శాఖ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ, కుటుంబ కక్షలు హత్యలకు దారితీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రౌడీషీటర్ల కదలికలపై కఠిన పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.

Next Story