- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కొరత... అన్నదాత కలత
రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జులై ఆఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈ నెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా

దిశ, కోదాడ: రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జులై ఆఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈ నెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 109 సహకార సంఘాలు..
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 109 సహకార సంఘాలకు 1,48,983 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని డిమాండ్ చేయగా 1,04,174 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారు. దీంతో సుమారు 44 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉమ్మడి జిల్లాకు ఇంకా రావలసి ఉంది. అదునులో యూరియా చల్లకపోతే వరి, పత్తి, మొక్కజొన్న పంటల్లో ఎదుగుదల ఆగిపోతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ఎదుగుదల సమయంలో యూరియా అవసరం ఎక్కువ. దాంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. అధికారులతో వాదనకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ముందు బారులు తీరి ఆందోళనకు దిగారు. ఆత్మకూరు (ఎస్)మండలం పరిధిలో రాస్తారోకో కూడా చేశారు. నడిగూడెం, తెల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ఒక దశలో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదువులోకి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతగిరి మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం మునగాల ప్రాథమిక సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు.
జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో వరిసాగు ..
సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది ఆగస్టులో 31 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబరులో జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా అదనంగా మరో 116 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 4.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. నాట్లు వేయటం కూడా పూర్తయింది. నానో యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు మాత్రం ఆసక్తి చూపటం లేదు. భారతదేశంలో తయారయ్యే నానో యూరియా వాడితే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. సూర్యాపేట జిల్లాలో 5600 లీటర్ల నానో యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. కానీ కొనుగోలు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు.
50 వేల టన్నులకు పంపించింది 35 వేలే...
జిల్లాలో ఆగస్టులో 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాదా 31 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 50 వేల టన్నులు యూరియా ఇస్తామని అంగీకరించగా ఇప్పటివరకు 35 వేల టన్నులు యూరియా వచ్చింది. లక్షల టన్నులు యూరియా వస్తేనే రాష్ట్రంలో యూరియా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని అధి కారులను ఆదేశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ కూడా రాశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రసాయన ఎరువుల వినియోగం తగ్గించే క్రమంలో భాగంగా సరిపడ యూరియా అందించడం లేదని పలువురు రైతులు అంటున్నారు.
భారీ వర్షాలతో నీట మునిగిన పంట..
ఇదిలా ఉండగా భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వరి నాట్లు, పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నడిగూడెం, మునగాల, చిలుకూరు, అనంతగిరి తదితర మండలాల్లోని వలు గ్రామాల్లో వరి పైర్లు వరదకు నీట మునిగాయి. దీంతో రైతులు తిరిగి నాట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్టుబడి పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. చెరువుల నుండి అలుగులు పోయటం, వరద నీరు వరి పొలాల పైకి ప్రవహించటంతో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇసుక మేట వేశాయి. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు యూరియా కొరత మరోవైపు భారీ వర్షాలు కురిసి పంటలు నష్టపోవడంతో రైతులు సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతున్నారు. యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, జరిగిన వంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.






