రైతులలో తీవ్ర ఆందోళన..

by I. Sairam |

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూ భారతి రిజిస్ట్రేషన్ కుంభకోణం ఘటనతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రైతులలో తీవ్ర ఆందోళన నెలకొంది.

రైతులలో తీవ్ర ఆందోళన..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూ భారతి రిజిస్ట్రేషన్ కుంభకోణం ఘటనతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రైతులలో తీవ్ర ఆందోళన నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1000 వరకు డాక్యుమెంట్లలో తక్కువ చలాన్ నమోదు అవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులలో భయం నెలకొంది. ఇప్పుడు తమ డాక్యుమెంట్ పరిస్థితి ఎంటనే ఆందోళన చెందుతున్నారు. తాము రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటి ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన చలాన్ అమౌంట్ చెల్లించే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, అయితే దళారుల మోస పూరిత వైఖరీ, అధికారుల నిర్లక్ష్యం వలన మద్యలో తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ డాక్యుమెంట్ పరిస్థితి ఎలా అని ఆందోళన...

అయితే జిల్లాలో ఇంతటి పెద్ద గందరగోళం జరగడంతో భూములు కొనుగోలు చేసిన రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తక్కువ రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించిన డాక్యుమెంట్లలో తమ డాక్యుమెంట్ ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం అవ్వక, తమ డాక్యుమెంట్ పరిస్థితి ఏమిటో అర్థం అవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఎందుకు చూడలేదని ఆవేదన...

అయితే ఇంత పెద్దగా కుంభకోణం జరుగుతున్న కనీసం అధికారులు ఎందుకు చూడలేదనే ప్రశ్న రైతులలో ఉత్పన్నమవుతుంది. ఒక రిజిస్ట్రేషన్ చేసే ముందు అన్ని సరి చూసుకోవాల్సిన అధికారులు కనీసం ఇంతటి పెద్ద ఎత్తున్న తప్పు జరుగుతున్న పట్టించుకోపోవడం వెనక అంతర్యం ఏమిటోనని చర్చించుకుంటున్నారు. జిల్లాలో 1000 కి పైగా డాక్యుమెంట్లలో ఇంతటి కుంభకోణం జరుగుతున్న, దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలలో ఉన్న ఒక్క తహసీల్దారు సైతం దీనిని గుర్తించకపోవడం ఏమిటనే ప్రశ్న అందరిలో నెలకొంది. ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకుల మోసపూరిత వైఖరి, తహసీల్దారు, సంబంధిత ఆపరేటర్ల ఉదాసీనతతో తమకు ఎక్కడ ఇబ్బంది ఎదురు అవుతుందోనని అందులోనే వ్యక్తం చేస్తున్నారు.

Next Story