భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగకుండా ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తామ‌ని.. అందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తామ‌ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, నార్కట్ పల్లి : భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగకుండా ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తామ‌ని.. అందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తామ‌ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశానికి హాజరై ఈ విధంగా మాట్లాడారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ దేవాలయం మరింత అభివృద్ధి జరిగేలా చూస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే రోజుల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రూ.100 కోట్లతో చెరువుగట్టు దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రించాలని మద్యం, మత్తు పదార్థాల వంటివి లేకుండా చూడాలన్నారు. పార్కింగ్ లో భక్తులకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దేవాలయ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అమావాస్యకు 50 వేల వరకు భక్తులు ఇక్కడ నిద్ర చేస్తారని.. వారికి సైతం వసతులు కల్పించేందుకు ముందుకు వెళ్తామన్నారు. ప్రతి ఏటా రూ.15 కోట్ల ఆదాయం ఈ దేవాలయానికి వస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మాట్లాడుతూ లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సీసీటీవీ లను కమాండ్ కంట్రోల్ రూమ్ కు టై అప్ చేయాలన్నారు. ఏడు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు రూట్ ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు. భక్తులు పార్కింగ్ నుంచి మొదలై దర్శనం పూర్తయి తిరిగి వెళ్లే వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కళ్యాణాన్ని భక్తులందరూ వీక్షించే విధంగా భారీ ఎల్ఈడీ లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఆర్డిఓ అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలయ ఈవో మోహన్ బాబు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ నేతకాని కృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ పాల్గొన్నారు.

Next Story