అనుమతులు లేకుండానే ఎగ్జిబిషన్.. పట్టించుకోని అధికారులు

by Ajay Maddhiboyina |

సూర్యాపేట జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ప్రజల ప్రాణాలకు హానిగా ఉంది.

అనుమతులు లేకుండానే ఎగ్జిబిషన్.. పట్టించుకోని అధికారులు
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ప్రజల ప్రాణాలకు హానిగా ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన ఆయా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ ను ప్రారంభించడంతో ఆయా శాఖల అధికారులపై జిల్లా ప్రజలు గుర్రుమంటున్నారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన స్తంభాంద్రి ట్రెడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వెనుక 36 వ వార్డు గోపాలపురంలో భారీ షెడ్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో రంగుల రాట్నం, బ్రేక్ డాన్స్ నుంచిమొదలుకొని వివిధ రకాల ప్రదర్శనలు ఉన్నాయి. పెద్దలకు చిన్నలకు ఏ ప్రదర్శన చూడాలన్న ఎంట్రీ టికెట్ ధర రూ. 50 పెట్టారు. అందులో చిన్న పిల్లల ఆటవస్తుల నుంచి మహిళలకు సంబంధించిన జనరల్ ఐటమ్స్ కూడా దొరికేలా అమ్మకాల కోసం పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆలాగే జూదానికి సంబంధించిన ఆటల ప్రదర్శన కూడా అందులో ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎగ్జిబిషన్ అనుమతి కోసం మున్సిపాల్ , పోలీస్ రెవెన్యూ ,ఫైర్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం ఆయా శాఖల నుండి ముందుగా అనుమతి పొందాల్సి ఉంది. కాగా సదరు ఎగ్జిబిషన్ నిర్వాహకులు అనుమతి కోసం కేవలo సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50,000 చలానా చెల్లించారు. మున్సిపాలిటీ వారు అనుమతులు ఇవ్వకముందే ఎగ్జిబిషనను ప్రారంభించడం తో జిల్లా ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

సంబంధిత శాఖల అనుమతులు అవసరం లేదా?...

ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీ దరఖాస్తు చేసుకొనే ముందు ఆయా సంబంధింత ఆయా శాఖల అధికారుల అనుమతి ముందుగా తీసుకోవాల్సి ఉంది. ఈ అనుమతుల కాపీలను జత చేసి మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఏ పత్రాలలో జత చేయకుండానే నేరుగా మున్సిపల్ శాఖ కు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి రూ. 50,000 డీడీని మాత్రమే సమర్పించారు. ఎగ్జిబిషన్ నిర్వహణకు ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ సంబంధిత శాఖ అధికారుల అనుమతి పత్రాలు పొందిన తర్వాతే ఎగ్జిబిషనను ప్రారంభించాల్సి ఉంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి కొంతమంది చోట మోట రాజకీయ నాయకుల అండాదండలతో ఎగ్జిబిషన్ ప్రారంభించడం జిల్లాలో చర్చనీయంగా మారింది. ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చేవారిలో ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళలు, ఉంటారు. ఇక్కడ జరగరానిది ఏమైనా జరిగితే వారి ప్రాణాలకు గ్యారెంటీ అంటూ ఏమి లేదు. సంబంధిత అధికారులు ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు ఆశపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సబబు అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజుపల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతరలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మరణించగా మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయిన సందర్భం కూడా ఉంది.దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తూ సందర్శకుల ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.

ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు....

సూర్యాపేట మున్సిపాల్ కమిషనర్...

హన్మంత్ రెడ్డి ...

సూర్యాపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు అయిన ఎగ్జిబిషన్ కి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు లేకుండా ప్రారంభించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాo. డిడి రూపంలో రూ. 50,000 చెల్లించారు తప్ప మిగతా సంబంధిత శాఖల అనుమతి పత్రాలను మాకు అందచేయ నందున అనుమతి ఇవ్వలేదు. అనుమతీ లేకుండా ప్రారంభించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.

Next Story