- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 28 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 28 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించారు. నేడు ఉదయం ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలకు విధులు కేటాయించనున్నారు. నల్గొండలో 14, సూర్యాపేటలో 8, యాదాద్రి భువనగిరిలో 6 మండలాల్లో పోలింగ్ జరగనుంది. నల్గొండ జిల్లాలో 7,892 మంది పోలింగ్ సిబ్బంది, యాదాద్రిలో 3,110 మంది, సూర్యాపేటలో 3,943 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, సిబ్బందికి సామాగ్రిని అందజేయనున్నారు. సామాగ్రి తరలింపు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌కు ముందు రోజు (10), పోలింగ్ రోజు (11) ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆదేశించారు.
- దిశ, నల్లగొండ బ్యూరో
దిశ, నల్లగొండ బ్యూరో : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో జరగనున్న ఎన్నికలకు జిల్లా అధికారులు సిద్ధం అయ్యారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. నేడు (బుధవారం) ఉదయం దాదాపు 8గంటల వరకు ఎన్నికల సిబ్బంది మండల కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తర్వాత సిబ్బందిని అధికారులు ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. కేటాయించబడిన సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకొని సాయంత్రం వరకు ఆయా గ్రామాలకు చేరుకుంటారు.
ఆ మండలాల్లో మొదటి దశ ఎన్నికలు...
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 28మండలాల్లో మొదటి దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో.. నల్గొండ, చండూరు డివిజన్లలోని 14 మండలాలు చండూరు, చిట్యాల, గట్టుప్పల్, కనగల్, కట్టంగూరు, కేతేపల్లి, మర్రిగూడ, మునుగోడు, నకిరేకల్, నల్గొండ, నాంపల్లి, నార్కెట్‌పల్లి, శాలిగౌరారం, తిప్పర్తిలోని 2,870 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను 7,892మంది సిబ్బందికి పీఓలు-3,444, ఓపీఓలు- 4,448మందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో...
యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట, ఆత్మకూరు(ఎం) మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 153 జీపీల్లో 11 పాలకవర్గాలతో సహా, 5 సర్పంచులు, 243 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నిర్వహణ కోసం 3,110మంది సిబ్బందికి పీఓలు-1,441, ఓపీఓలు-1,669 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో...
ఆత్మకూరు(ఎస్), సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలకు, 1,442 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. 20శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి 3,943 మంది సిబ్బంది పీఓలు-1,683, ఓపీఓలు-2,260లకు ర్యాండమైజేషన్ జరిపారు.
మండలాల నుంచే పోలింగ్ సామగ్రి పంపిణీ...
పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇప్పటికే ఎన్నికలు జరిగే మండల కేంద్రాలకు తరలించారు. నేడు ప్రతి మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు సామగ్రిని పంపించనున్నారు. పోలింగ్ సిబ్బందికి సైతం వారి విధులను నేడు అధికారులు ప్రకటించనున్నారు. ఈ తరలింపులో ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేతనంతో కూడిన సెలవు...
నల్గొండ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ డిసెంబర్ నెలలో 10, 11, 13, 14, 16, 17తేదీల్లో అన్ని షాపులు, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, నల్గొండ తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించారు.
ఆ రోజులు సెలవులు...
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో స్థానిక సెలవుదినంగా ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 10, 11న, అలాగే రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 13, 14న, మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 16, 17 తేదీలలో స్థానిక సెలవుదినంగా ప్రకటించినట్లు కలెక్టర్లు తెలిపారు.






