రూ.10కోట్లు అయినా తగ్గేదేలే..

by I. Sairam |

సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే రూ.5కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిందేనని ప్రధాన పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా స్పష్టం చేస్తున్నారు.

రూ.10కోట్లు అయినా తగ్గేదేలే..
X

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు ఈసారి అత్యంత ఖరీదుగా మారనున్నాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే రూ.5కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిందేనని ప్రధాన పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా స్పష్టం చేస్తున్నారు. ఇందుకు ఆశావహులు సైతం ఏమాత్రం వెనకాడకుండా, ఎంతైనా ఖర్చు పెడతామంటూ బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలోని సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్ నగర్ మున్సిపాలిటీల్లో తమను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమని పలువురు నేతలు ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు అధికార పార్టీ బీ-ఫాం కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక నాయకుడైతే తన ప్యానల్‌లో కౌన్సిలర్‌గా పోటీ చేసే వారికి వార్డుకు రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే రూ.5కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిందేనని ప్రధాన పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా స్పష్టం చేస్తున్నారు. ఇందుకు ఆశావహులు సైతం ఏమాత్రం వెనకాడకుండా, ఎంతైనా ఖర్చు పెడతామంటూ బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలోని సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల్లో తమను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమని పలువురు నేతలు ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు అధికార పార్టీ బీ ఫాం కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక నాయకుడైతే తన ప్యానల్‌లో కౌన్సిలర్‌గా పోటీ చేసే వారికి వార్డుకు రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

ఖర్చుకు వెనకాడని నాయకులకే టిక్కెట్లు...

జిల్లా కేంద్రమైన సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్ నగర్, నేరెడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో కేవలం ధనబలం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఖర్చును భరించే వారికే కౌన్సిలర్ టికెట్లు ఇవ్వాలని, చైర్మన్ హామీ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ బలంగానే ఉన్నప్పటికీ, చైర్మన్ పీఠం దక్కాలంటే రూ.6కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు వ్యయం చేయాల్సిందేనని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీని నమ్ముకుని జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు దక్కుతుందా? లేక ఆఫర్ ఇచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాస్ట్లీగా మారనున్న మున్సిపల్ ఎన్నికలు..

వచ్చే ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో, ఆశావహులు నిధుల సమీకరణలో నిమగ్నమయ్యారు. గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడైందని, 500 ఓటర్లు లేని పంచాయతీల్లోనే రూ.10లక్షల వరకు ఖర్చయిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు మరింత ఖరీదుగా మారనున్నాయి. ఒక్కో వార్డులో కనీసం 1500 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉన్నందున, ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.30లక్షల పైచిలుకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్ పీఠం కోసం ఎంత ఖర్చయినా వెనకాడబోమని తమ అగ్రనేతలకు ఆశావహులు స్పష్టం చేస్తుండడంతో ఈ ఎన్నికలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారనున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story