భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలి: ఎమ్మెల్సీ

by Kodari Anjali |

భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలి: ఎమ్మెల్సీ
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... ఇంటి యజమానులు,భవన నిర్మాణ గుత్తేదారుల మధ్య గిట్టుబాటు ధరలపై చర్చించాలని, స్థానిక కంపెనీలో పని చేసే కార్మికులు సంఘ నిబంధనలను కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికునికి 55 సంవత్సరాలు నిండితే 6000 రూపాయల పెన్షన్ వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల ఎక్స్గ్రేషియా అంగవైకల్యం కలిగితే పది లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగే వరకు తాను చట్టసభల్లో గొంతెత్తుతానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, సిపిఎం నాయకులు దోనూరి నర్సిరెడ్డి, పల్లె గోపాల్ రెడ్డి, కార్మికులు దుబ్బాక సంజీవ, నెల్లికంటి జంగయ్య, కొంగరి మారయ్య, జనగాం శంకరయ్య, పులమోని శంకర్, సుక్క యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story