ఓట‌ర్లు ప్ర‌లోభాల‌ను తిర‌స్క‌రిస్తే త‌ప్ప త‌ల‌రాత‌లు మార‌వు : క‌లెక్ట‌ర్ వి.హ‌నుమంత‌రావు

by Nallavelli.Anjaneyulu |

దిశ, సంస్థాన్ నారాయణపురం : ఓటర్లు ప్రలోభాలను తిరస్కరిస్తే తప్ప వారి తలరాతలు మారవ‌ని యాదాద్రి భువనగిరి కలెక్టర్ వి. హనుమంతరావు అన్నారు.

ఓట‌ర్లు ప్ర‌లోభాల‌ను తిర‌స్క‌రిస్తే త‌ప్ప త‌ల‌రాత‌లు మార‌వు :  క‌లెక్ట‌ర్ వి.హ‌నుమంత‌రావు
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : ఓటర్లు ప్రలోభాలను తిరస్కరిస్తే తప్ప వారి తలరాతలు మారవ‌ని యాదాద్రి భువనగిరి కలెక్టర్ వి. హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఓటరు అవగాహన మరియు చైతన్య (స్వీప్)కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక గ్రామపంచాయతీ నుంచి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వరకు ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ ని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసేందుకే స్వీప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీంతో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. మిగిలిన రెండు విడతల్లో కూడా అత్యధిక పోలింగ్ నమోదయ్యేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు సహకరిస్తున్న సాంస్కృతిక సారధి కళాకారులను ఆయన అభినందించారు. యువత తీరు మారాలని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. మద్యం డబ్బుకు ఓటు వేయవద్దని ఓటర్లను చైతన్యపరిచేలా విద్యార్థులు కూడా ప్రవర్తించాలని అన్నారు. ఓటర్లు మద్యం, డబ్బులను తిరస్కరిస్తే అభ్యర్థులు తిరిగి పంపరని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తే ఎన్నికైన ప్రజాప్రతినిధిని ప్రశ్నించి పని చేయించుకోవచ్చని తెలిపారు.


అమలు సాధ్యం కానీ హామీలకు లొంగవద్దని గ్రామాభివృద్ధి ఎవరితో సాధ్యమో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. డబ్బులు తీసుకుని ఓటేస్తే సమస్యలు వస్తే ప్రజాప్రతినిధిని ఎలా పరిష్కరించమని అడుగుతారని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు గ్రామంలో నిత్యం సహాయంగా ఉండే వారిని ఎన్నుకోవాలని సూచించారు. గ్రామాలకు ఉపయోగపడే వ్యక్తులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వేలంపాటలకు మద్యం కోసం ఏకగ్రీవం చేయవద్దని చెప్పారు. మార్పు గ్రామస్థాయి నుండి ప్రారంభం కావాలని సారా వ్యతిరేక ఉద్యమం కూడా నిరుపేద మహిళనుండే ప్రారంభమైందని గుర్తు చేశారు. చైతన్యం గల గ్రామంగా నారాయణపురం మరోసారి రుజువు కావాలంటే డబ్బు మద్యం ను తిరస్కరించాలని, విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఐఏఎస్,ఐపీఎస్ లకు పాఠాలు నేర్పే కేంద్రంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం నిలిచిందని దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఓటర్లచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి నాగిరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, స్థానిక తహసిల్దార్ పి.శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రమోద్ కుమార్,ఎస్సై జగన్, ఎంపీఓ నరసింహారావు,ఏపీఎం శ్రీదేవి, సీసీలు విష్ణు, సత్యనారాయణ, గడ్డం వెంకటయ్యలు, మహిళా సమాఖ్య సభ్యురాలు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story