బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

by I. Sairam |

మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ తరగతులలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. ఎన్నికల విధులకు డ్యూటీలు వేసిన ప్రతి ఒక్కరు విధుల్లో చేరాలని ఎవ్వరికీ కూడా మినహాయింపు ఉండదన్నారు.

పోలింగ్ సామగ్రిని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి బాలెట్ పేపర్స్, పోలింగ్ బాక్సులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం, సీల్ వేయడం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ నుండి పోలింగ్ ముగిసే వరకు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతోపాటు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పాక్షికంగా ఉండాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, మాస్టర్ ట్రైనర్ నర్సిరెడ్డి, ప్రిసైడింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story