జూలై రెండో వారంలో వాసాలమర్రికి సీఎం రేవంత్ రెడ్డి..?

by velandi.Saikiran |   (  Updated:2026-06-29 23:30:49  IST  )

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన వాసాలమర్రి గ్రామం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

జూలై రెండో వారంలో వాసాలమర్రికి సీఎం రేవంత్ రెడ్డి..?
X

వాసాలమర్రి అంటే తెలియనివారుండరు.. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేకంగా దత్తత తీసుకోవడంతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంది. భువనగిరికి దాదాపు 27 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామం మళ్లీ వార్తలోకి వస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకొని గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనాలు నిర్వహించడం, గ్రామాభివృద్ధికి భారీ హామీలు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తరువాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తికాకపోవడంతో గ్రామ ప్రజల్లో నిరాశ నెలకొంది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాసాలమర్రిని ప్రత్యేక అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వచ్చే జూలై రెండో వారంలో గ్రామంలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసింది.- దిశ యాదాద్రి భువనగిరి ప్రతినిధి

దిశ యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వాసాలమర్రి గ్రామం మరోసారి ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ స్వయంగా గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామస్థులతో కలిసి సామూహిక భోజనాలు నిర్వహించడం, గ్రామాభివృద్ధికి భారీ హామీలు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తికాకపోవడంతో గ్రామ ప్రజల్లో నిరాశ నెలకొంది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాసాలమర్రిని ప్రత్యేక అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వచ్చే జూలై రెండో వారంలో గ్రామంలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసింది.

ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వాసాలమర్రి గ్రామానికి ఏకంగా 143 ఇండ్లు మంజూరయ్యాయి. సీఎం పర్యటన నాటికి వీటి నిర్మాణ పురోగతిని మెరుగుపరచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 143 ఇండ్లలో 57 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇందులో 27 ఇండ్లు స్లాబ్ స్థాయికి చేరుకోగా, 10 ఇండ్లు రూఫ్ లెవెల్‌లో ఉన్నాయి. మరో 12 ఇండ్లు బేస్‌మెంట్ దశలో కొనసాగుతున్నాయి. ఐదు ఇండ్లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే ఇంకా 32 మంది లబ్ధిదారులు నిర్మాణ పనులను ప్రారంభించలేదు.‌

రంగంలోకి హౌసింగ్ ఎండీ, కలెక్టర్...

వాసాలమర్రి గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు తరచూ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. హౌసింగ్ శాఖ సాంకేతిక బృందాలతో కలిసి నిర్మాణ స్థలాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పనుల వేగంపై సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. గ్రామాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఇప్పటికే సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది.

కొంత మంది లబ్ధిదారులకు స్థలాల సమస్య...

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా నిర్మాణాలు ప్రారంభం కాని 32 మందిలో కొంత మంది లబ్ధిదారుల వెనుక ప్రధాన కారణంగా స్థలాల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ సొంత స్థలం లేకపోవడం వల్ల వారు పనులు ప్రారంభించలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థలాలు లేని లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంటుందా? వారికి ఇంటి స్థలాల కేటాయింపుపై ఏదైనా శుభవార్త ప్రకటిస్తుందా? అనే ఆసక్తి గ్రామంలో నెలకొంది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే గ్రామంలోని అన్ని అర్హుల సొంతింటి కల సాకారమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ వార్తల్లోకి వాసాలమర్రి...

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన వాసాలమర్రి గ్రామం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. సీఎం పర్యటన ఖరారైతే గ్రామాభివృద్ధికి కొత్త ఊపు రావడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందనే ఆశ గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థలాల సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలపై స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story