ఏ పంట ఎంత..? యాదాద్రి జిల్లాలో పంటల డిజిటల్ సర్వే

by Ajay Maddhiboyina |

వ్యవసాయ శాఖాధికారులు, విస్తరణ అధికారులు పొలం బాట పట్టారు. వానకాలం సీజన్‌లో రైతులు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారనే విషయమై డిజిటల్‌ సర్వేలో‌ నిమగ్నమయ్యారు. పంట వివరాలు సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏ పంట ఎంత..? యాదాద్రి జిల్లాలో పంటల డిజిటల్ సర్వే
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : వ్యవసాయ శాఖాధికారులు, విస్తరణ అధికారులు పొలం బాట పట్టారు. వానకాలం సీజన్‌లో రైతులు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారనే విషయమై డిజిటల్‌ సర్వేలో‌ నిమగ్నమయ్యారు. పంట వివరాలు సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిజిటల్ సర్వే కారణంగా తప్పులు తగ్గుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతులు కూడా సర్వేలో చురుకుగా పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. గ్రామ స్థాయిలో వార్డులు, భూమి, పంట వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నారు.పంట వివరాల్లో వైవిధ్య, సాంకేతికత గణనీయంగా ఉంటుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వే పూర్తి చేయడంలో రైతులు సహాయసహకారాలు అందించాలి. జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో మొత్తం 4 లక్షల పైగా ఎక‌రాల్లో క్రాప్ సర్వే‌ను చేపడుతున్నారు.

సాగులో కచ్చితత్వం‌ కోసం.....

పంట సాగులో కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం ఒక యాప్‌ను రూపొందించింది. జిల్లాలో 92 క్లస్టర్లు ఉండగా, వాటి పరిధిలో 92 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు పని చేస్తున్నారు. పంటలు సాగు చేసే సమయం పూర్తి కావడంతో ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. పొలాల వద్దకు వెళ్లి పంటలను రైతుతో కలిసి ఫొటోలు తీసి రైతు వివరాలు, సర్వే నంబర్‌, పట్టాదారు పాసు పుస్తకం నంబర్‌, సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం వివరాలు నమోదు చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత సర్వే వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. పంటల సాగు వివరాలు నమోదు చేయడం వల్ల రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేందుకు దోహదపడతాయి. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను విక్రయించేటప్పుడు తప్పుడు వివరాలు నమోదు చేయకుండా ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వం సన్న రకం వరి సాగు చేసే రైతులకు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో ఒక రైతు తాను పండించిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎంత విస్తీర్ణంలో సన్నరకం వరి పంట వేశారో, తద్వారా ఎంత దిగుబడి వస్తుందో, అంతకు మాత్రమే బోనస్‌ చెల్లిస్తారు. అక్రమాలకు తావు లేకుండా ఉపయోగపడనున్నది. అలాగే పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకునేందుకు దోహద పడనున్నది. అక్టోబర్‌ నెలాఖరు వరకు సర్వేను పూర్తి చేయనున్నారు.

జిల్లాలో 92 క్లస్టర్లు ....

మొత్తం జిల్లాలో 92 క్లస్టర్లు ఉన్నాయి‌. 4 లక్షల‌పైగా ఎకరాలు సర్వే చేయాలని నిర్ణయించారు. ఒక్కో ఏఈవో 2000 ఎకరాల వరకు సర్వే చేపట్టనున్నారు. ఒక్కో పురుష ఏఈఓలు 2000 ఎకరాలు, మహిళా ఏఈఓలు 1800 ఎకరాలు సర్వే నిర్వహిస్తారు. మిగిలిన వాటికి సాధారణ క్రాప్ బుకింగ్ పద్ధతిలో నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 6 లక్షలకు పైగా వ్యవసాయానికి అనుకూలంగా సాగుభూమి ఉన్న గత ఐదు సంవత్సరాల నుంచి 4.50 లక్షల ఎకరాల వరకు రైతులు సాగు చేస్తున్నారు. ఈ డిజిటల్ సర్వే గడువు అక్టోబర్ 20 వరకు కొనసాగుతుంది.

రైతులకు మేలు చేసే సర్వే : పీవీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, యాదాద్రి భువనగిరి

ఈ డిజిటల్ క్రాఫ్ట్ సర్వే వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. రైతుల పంటల విషయంలో సైతం అధికారుల దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. దీనివలన చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి సులభతరంగా మారుతుంది. రైతులు పండించిన పంటలు, ధాన్యం విక్రయంచే క్రమంలో ఎదురయ్యే సమస్యలకు ఈ సర్వే ద్వారా పరిష్కారం లభిస్తుంది.

Next Story