- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగం పర్మినెంట్ చేయమంటే.. ఉన్న ఉద్యోగాన్నే ఊడగొట్టారా?
వజినేపల్లికి చెందిన ఆరుగురు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడంతో కుటుంబాలతో కలిసి జెన్కో గేటు వద్ద ధర్నా చేశారు.

దిశ, చింతలపాలెం: "ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయమంటే.. ఉన్న ఉద్యోగాన్నే తీసేస్తారా?" అంటూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణ జెన్కో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జెన్కో ప్లాంట్ నిర్మాణంలో జరిగిన విషాద ఘటనలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఉపాధి హామీని ఇప్పుడు కాలరాస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. జెన్కో విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో వజినేపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు కూలి పనులకు వెళ్లగా, మట్టి కుప్పలు కూలి ఐదుగురు యువకులు మృతి చెందారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం, జెన్కో యాజమాన్యం హామీ ఇచ్చి, వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించింది. అయితే, ఆ ఉద్యోగాలను శాశ్వతం చేయాలని కోరుతూ సుమారు రెండు నెలల క్రితం వజినేపల్లి గ్రామానికి చెందిన 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులు జెన్కో ప్రధాన గేటు వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించారు.
ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి...
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో వారు తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లగా, అందులో ఆరుగురు ఉద్యోగులను గేటు వద్దే అడ్డుకుని, "మీ సేవలను రద్దు చేశాం. మీ స్థానంలో రామగుండం నుంచి ఆరుగురు ఉద్యోగులను తీసుకొచ్చాం" అని చెప్పినట్లు బాధితులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి జెన్కో గేటు వద్ద ధర్నాకు దిగారు. "జెన్కో కోసం మా కుటుంబాలు భూములు కోల్పోయాయి. మా ఇంటి పెద్దలను ప్రమాదంలో కోల్పోయాం. ఇచ్చిన హామీ మేరకు వచ్చిన ఉద్యోగాలను కూడా ఇప్పుడు లాక్కుంటే మా కుటుంబాలు ఎలా బతకాలి?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన హామీలను అమలు చేసి కాంట్రాక్టు ఉద్యోగాలను శాశ్వతం చేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చింతలపాలెం ఎస్సై పరమేష్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించే దిశగా అధికారులతో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్తత కొంత సద్దుమణిగింది. బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీల అమలుపై జెన్కో యాజమాన్యం ఎలా స్పందిస్తుందనే దానిపై ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.






