- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల జాప్యం..
తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల జాప్యం కావడం వల్ల స్లాట్ బుక్ చార్జీలు పెరగడంతో బాధితుల లబోదిబోమంటున్నారు.

దిశ, దేవరకొండ టౌన్: తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడంతో సామాన్య మానవుడిపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. అయితే, అధికారుల నిర్లక్ష్యం మరియు సాంకేతిక లోపాల కారణంగా ముందే స్లాట్ బుక్ చేసుకున్న బాధితులకు ఈ పెరిగిన చార్జీలు శాపంగా మారాయి. దేవరకొండ తహసీల్దార్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కోసం ముందే స్లాట్లు బుక్ చేసుకున్నారు. జూన్ 1న స్లాట్ బుక్ అయి నాలుగు రోజులు గడుస్తున్నా, నేటి జూన్ 5, శుక్రవారం వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. దేవరకొండ తహసీల్దార్ ఆఫీసులో దాదాపు 40 ఫైళ్ల వరకు స్లాట్ బుక్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు కాకుండా పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి..
సకాలంలో రిజిస్ట్రేషన్లు చేయకపోగా, శుక్రవారం నుండి ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను అమల్లోకి తెచ్చింది. దీనితో, ముందే స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ అధికారుల ఆలస్యం వల్ల ఇప్పుడు పెరిగిన చార్జీలను చెల్లించాల్సి వస్తోందని బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద లబోదిబోమంటున్నారు. తప్పు అధికారులది అయితే శిక్ష మాత్రం సామాన్యుడికా అంటూ మొత్తుకుంటున్నారు. పెరిగిన చార్జీలతో సామాన్య మానవుడి నడ్డి విరుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సమస్యపై బాధితులు స్థానిక తహసిల్దార్ ని వివరణ కోరగా ఎలాంటి సమాధానం లభించలేదు. కార్యాలయంలోని సంబంధిత సెక్షన్ అధికారులను అడిగితే.. "రిజిస్ట్రేషన్ సైట్ స్లోగా సర్వర్ డౌన్ఉం దంటూ సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, జూన్ 1న స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కాని ఫైళ్లకు పాత చార్జీల ప్రకారమే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని దేవరకొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






