ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక అడుగు.. రేపు సిట్ ముందు ఎంపీ విచారణ

by Ramesh Naini |

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందం (సిట్) వేగవంతం చేసింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక అడుగు.. రేపు సిట్ ముందు ఎంపీ విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందం (సిట్) వేగవంతం చేసింది. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేపు సిట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రావాలని పోలీసులు ఆయనకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనంతరం జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెలలోనే ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బాధితుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది.

Next Story