మీరే తేల్చుకోండి..

by Bhanu |   (  Updated:2025-11-28 13:50:13  IST  )

మండలంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై ఎమ్మెల్యే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పార్టీల మండల కార్యవర్గాలతో వేర్వేరుగా ఎమ్మెల్యే పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మీరే తేల్చుకోండి..
X

దిశ, చిలుకూరు : మండలంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై ఎమ్మెల్యే తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పార్టీల మండల కార్యవర్గాలతో వేర్వేరుగా ఎమ్మెల్యే పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో తమ తమ బలాబలాలు, గెలుపోటముల అనుకూల, ప్రతికూలతలు, రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని రెండు పార్టీలు ముందడుగు వేయాలని సూచించారు. అనాదిగా పార్టీలో ఉంటూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వ్యక్తులనే కాంగ్రెస్ అభ్యర్థులుగా నిర్ణయించాలని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి రెండు పార్టీలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు తమ గ్రామంలో కాకుండా ఇతర గ్రామాల అభ్యర్ధుల ఎంపికలో జోక్యం చేసుకోవద్దన్నారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్, సీపీఐ మండల నాయకులు పాల్గొన్నారు.

సీపీఐ, కాంగ్రెస్ సై అంటే సై..

చిలుకూరు మేజర్ గ్రామపంచాయతీని పొత్తులో భాగంగా ఈసారి తమకే కేటాయించాలని కాంగ్రెస్ పట్టబడుతోంది. ఇప్పటికే సీపీఐ తమ అభ్యర్ధిగా దొడ్డా రమేష్ బాబు సతీమణి నాగమణిని తెరపైకి తీసుకొచ్చేందుకు దాదాపు రంగం సిద్ధం చేసింది. తామూ పోటీ చేస్తామని, తమకు టీడీపీ, బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తాయని కాంగ్రెస్ అంటోంది. మేజర్ జీపీ బేతవోలులో కాంగ్రెస్ నాయకులైన మాజీ సర్పంచ్ వట్టికూటి నాగయ్య, వనపర్తి రామారావు ఇద్దరూ రంగంలో ఉండేందుకు ఇప్పటికే మందుమాకులు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ఇద్దరూ కాంగ్రెస్ నాయకులే రంగంలో ఉండే అవకాశం ఉంది. ఇతర పార్టీల పొత్తులు, సామాజిక వర్గాల ఓట్ల సమీకరణపై వీరి జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. జెర్రిపోతులగూడెంలో కాంగ్రెస్, సీపీఐ పోటీ అనివార్యం. పాలెఅన్నారంలో సీపీఐ నుంచి మాజీ సర్పంచ్ మండవ వెంకటేశ్వర్లు తన భార్యను పోటీ చేయించేందుకు పార్టీ అనుమతి తీసుకున్నారు. అదే గ్రామంలో కాంగ్రెస్ నుంచి కొండా ప్రభాకర్, మండవ చిన్న మధు తమ సతీమణులను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధిగా మాజీ ఉప సర్పంచ్ తమ్మనబోయిన శ్రీనివాసరావు భార్య పద్మను తమ అభ్యర్ధిగా ప్రకటించేందుకు చర్చలు నడుపుతోంది. రామాపురంలో కాంగ్రెస్ నుంచి నలబోతు సత్యనారాయణ, టీడీపీ నుంచి వేమూరి సురేష్ అభ్యర్ధిత్వాలు దాదాపు ఖరారైనట్లే. శనివారం నాటి కాంగ్రెస్, సీపీఐ నిర్వహించే సమన్వయ కమిటీల సమావేశాల్లో పొత్తులు తేలనున్నాయి. ఇదిలా ఉండగా చిలుకూరు, పాలె అన్నారం, జెర్రిపోతులగూడెంలో సీపీఐ సర్పంచ్ పదవికి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జెడ్పీ మాజీ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Next Story