- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా లో-లెవెల్ వంతెనలు
నియోజకవర్గంలోని పలు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెనల కారణంగా సమీప గ్రామాల ప్రజల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. దీంతో

దిశ, హాలియా : పలు గ్రామాల్లో లో లెవెల్ వంతెనలు ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు రాకపోకలు నిలిచి ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా రద్దీ ఎక్కువ ఉన్న రహదారుల్లో ఈ సమస్య అధికంగా పునరావృతం అవుతోంది. ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజల ప్రయాణాలకు ప్రాణ సంకటంగా మారుతోంది. తాజాగా వర్షాకాలం సీజన్ కావడంతో హాలియా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న లో లెవల్ వంతెనలు వరద తాకిడికి దెబ్బతిన్నాయి. రద్దీగా ఉన్న గ్రామాల మధ్య హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షాకాలం సీజన్ వచ్చిందంటే పలు గ్రామాల్లో లో లెవెల్ వంతెనలతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. దశాబ్దాల కింద నిర్మించిన లో లెవల్ కల్వర్టుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రద్దీ ఎక్కువ ఉన్న రహదారుల్లో ఈ సమస్య ప్రత్యేకంగా పునరావృతం అవుతోంది. అయినప్పటికీ పాలక ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజల ప్రయాణాలకు ప్రాణ సంకటంగా మారుతోంది. గత 30-40ఏళ్ల కింద పలు రహదారుల్లో చేపట్టిన లోలెవెల్ కల్వర్టులు శిథిలావస్థకు చేరుకొని ప్రమాదాలను సూచిస్తున్నాయి. ప్రతి ఏటా ఇబ్బందులు తలెత్తిన సమయంలో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇట్టే చేతులు దులుపుకుంటున్నారు. అనంతరం కొన్నాళ్లకే వంతెనలు యధాస్థితికి చేరుకోవడంతో అధిక నీటి ప్రవాహ సమయంలో లో లెవెల్ కల్వర్టులపై ప్రమాదాలు సాధారణంగా మారాయి.
నీటి ఉధృతికి కొట్టుకుపోతున్న కల్వర్టులు..
తాజాగా వర్షాకాలం సీజన్ కావడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న లో లెవల్ వంతెనలు వరద తాకిడికి దెబ్బతింటున్నాయి. ఇందులో భాగంగా పేరూరు సోమసముద్రం చెరువు అలుగు దిగువ భాగాన ఉన్న లో లెవెల్ వంతెన గత రెండు రోజుల కింద వరద తాకిడికి పూర్తిగా కూలిపోయింది. సుమారు నాలుగు రోజులపాటు వంతెనపై అత్యధిక వరద ప్రవాహం ఉండడంతో పలుచోట్ల కోతకు గురై వంతెన దిగువ భాగాన ఉన్న గూనలు ధ్వంసం కావడంతో కల్వర్టు పగుళ్లు ఏర్పడి వరద తాకిడికి తెగిపోయింది. దీంతో ఐదు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిడమనూరు మండల కేంద్రం నుంచి బంకాపురం, వెనిగండ్ల వెళ్లే ప్రధాన రహదారి మోడల్ స్కూల్ వద్ద ఉన్న కల్వర్టు గత వారం రోజులుగా అధిక నీటి ప్రవాహం కారణంగా పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గత సంవత్సరం సైతం ఈ రహదారి పలుచోట్ల దెబ్బతినడంతో కొన్ని రోజులపాటు రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి ఇదే పరిస్థితి ఈ సంవత్సరం సైతం పునరావృతం అయింది. అనుముల మండలంలోని రామడుగు-యాచారం మధ్య ఉన్న లో లెవెల్ కల్వర్టుపై గత వారం రోజులపాటు అధిక నీటి ప్రవాహంతో సమీప గ్రామాల ప్రజల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది. నిడమానూరు మండలంలోని మారుపాక-ఎర్రబల్లి గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనలపై ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. తిరుమలగిరి సాగర్ మండలంలోని తిరుమలగిరి-కొంపల్లి గ్రామాల మధ్య ఉన్న బర్ల బంధం వంతెనపై ప్రతి ఏటా వర్షాకాలం సీజన్ లో రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
హై లెవెల్ వంతెనలకు మోక్షం ఎప్పుడో?
నియోజకవర్గంలోని పలు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెనల కారణంగా సమీప గ్రామాల ప్రజల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఈ విషయంపై పలుమార్లు గత ప్రభుత్వంలో హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు వినతులు చేసినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించ లేదు. అధికారులు ఎప్పటికప్పుడు వంతెనల పరిస్థితులపై దృష్టి సారించకపోవడంతో ప్రమాదాలు ఏర్పడుతున్నాయని, ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉన్న గ్రామాల మధ్య హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేయడం ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పునరుద్ధరణ పనులు చేపడతాం- రాజశేఖర్, డీఈఈ, ఆర్ అండ్ బీ శాఖ
పెరుగు సోమసముద్రం చెరువు అలుగు కారణంగా దిగువ భాగంలో కూలిన లో లెవెల్ వంతెన పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడతాం. ఇప్పటికే సమస్యాత్మకంగా ఉన్న లో లెవెల్ వంతెనలను గుర్తించడం జరిగింది. త్వరలో వాటి మరమ్మతులకు చర్యలు చేపడుతాం.






