- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండ మడుగు సంత టెండర్ లో కాంట్రాక్టర్లు కుమ్మక్కు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో నిర్వహించిన సంత వేలం పాటలో కాంట్రాక్టర్లు కుమ్మక్కైనట్లు తెలుస్తోంది.

దిశ, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో నిర్వహించిన సంత వేలం పాటలో కాంట్రాక్టర్లు కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. గత ఏడాది కొండమడుగు సంత వేలం పాట ద్వారా లభించిన ఆదాయం కంటే తక్కువ మొత్తానికి కాంట్రాక్టర్లు కొట్టేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది కొండమడుగు గ్రామపంచాయతీకి అంగడి వేలం పాట ద్వారా రూ. 91 లక్షల ఆదాయం వచ్చింది. ఆ కాంట్రాక్టు మార్చి 31 తో ముగియనుంది. అయితే ఈ ఏడాది 2026-27 సంవత్సరానికి సంబంధించిన అంగడి వేలం పాట మార్చి 3 తేదీన నిర్వహించారు.
సుమారు 69 మంది కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేసినట్లు తెలిసింది. కానీ ఆ టెండర్ పాటలు కేవలం నలుగురు, ఐదుగురు మాత్రమే ప్రత్యక్షంగా వేలం పాట కొనసాగించారని తెలిసింది. టెండర్ లో పాల్గొన్న వాళ్లు లక్ష రూపాయలు డిపాజిట్ తో పాటు ఐదు లక్షలు కింద చెల్లిస్తారు. ఈ వేలం పాటలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.80.10 లక్షల వరకు వేలం పాట సంతను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. అయితే గత ఏడాది కన్నా తక్కువ ఆదాయం వేలంపాట రూపంలో దక్కిందని పంచాయతీ అధికారులు వారం రోజుల తర్వాత రెండోసారి వేలం పాట పెట్టారు. ఆ సందర్భంలో వేలం పాటలో పాల్గొనే కాంట్రాక్టర్లు సీక్రెట్ కవర్ లో సంత వేలం విలువ రాసి ప్రత్యేక బాక్సులో వేశారు. దాంతో అత్యధికంగా రూ. 80.13 లక్షల వరకు ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీకి చెల్లిస్తానని రాసినట్టు సమాచారం.
రెండోసారి నిర్వహించిన వేలంపాటలో కూడా 2025-26 సంవత్సరం ఆదాయం కన్నా తక్కువగా రావడంతో పంచాయతీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి నిర్ణయాధికారం వారికే వదిలేసినట్లు తెలిసింది. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు అంగడి సరిగ్గా నడుస్తలేదని కారణం చెప్పి కుమ్మక్కై గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయానికి కష్టం కలిగించేలా కుట్రకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో కొంతమంది గ్రామపంచాయితీ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్టర్లకు సహకరిస్తున్న కొంతమంది సభ్యులకు ఇప్పటికే కొంత సొమ్ము ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు గ్రామ పంచాయతీకి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






