రికార్డు స్థాయిలో రైతులు పంట పండించారు: ప్రభుత్వ విప్

by Kodari Anjali |

సీఎం సహాయనిధి పథకం పేదలకు ఒక వరం లాంటిదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

రికార్డు స్థాయిలో రైతులు పంట పండించారు: ప్రభుత్వ విప్
X

దిశ, నకిరేకల్: సీఎం సహాయనిధి పథకం పేదలకు ఒక వరం లాంటిదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ.. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. నకిరేకల్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన 45 లక్షల రూపాయల విలువైన చెక్కులను శుక్రవారం అందజేసి మాట్లాడారు. ఈ ఏడాది రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారని వెల్లడించారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. రామన్నపేట మండలంలో ఉన్నటువంటి కొద్దిపాటి ధాన్యాన్ని మరో మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు లేకుండానే ఇన్ని పంటలు పండాయి అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటల దిగుబడి పెరిగింది అనేది అబద్ధమని రుజువైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతింటి కలలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, సిద్ధగొని స్వామి గౌడ్, దొండ రమేష్, నేతగాని కృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story