విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏపీ మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేద‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. వచ్చే మూడేళ్ల‌లోనూ ఎటువంటి విద్యుత్ ఛార్జీల పెంపులు, అద‌న‌పు భారాలు ఉండ‌వ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు...

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఏపీ మంత్రి కీలక ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం చంద్రబాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేద‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. వచ్చే మూడేళ్ల‌లోనూ ఎటువంటి విద్యుత్ ఛార్జీల పెంపులు, అద‌న‌పు భారాలు ఉండ‌వ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాల‌న‌లో విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను సర్వ నాశ‌నం చేసిందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. ఆర్థికంగానూ దెబ్బతీసి విద్యుత్ వ్యవస్థ మ‌నుగ‌డ‌కే ముప్పు తెచ్చార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు దార్శ‌నిక‌త‌తో రెండేళ్ల వ్యవధిలోనే విద్యుత్ శాఖ‌ను గాడిలో పెట్టామ‌న్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శుక్రవారం నోట్ విడుదల చేశారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని కూట‌మి ప్రభుత్వం ట్రూ డౌన్‌గా మార్చి చరిత్ర సృష్టించిందన్నారు. విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం మోపకుండా 13 పైసలు ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమ దేనని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. ఇందుకు భిన్నంగా కూట‌మి ప్రభుత్వం ప్ర‌జా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే వినియోగదారులపై అదనపు భారాన్ని మోపకుండా చర్యలు చేపడుతోందని వివ‌రించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా తెలిపారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంప్రదాయేతర ఇంధన రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం సూర్య‌ఘ‌ర్ ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కూట‌మి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. అలాగే, ఆర్డీఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలు తగ్గించడంతో పాటు విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపర్చేందుకు పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. దీనితో విద్యుత్ అంత‌రాయాలు, లో ఓల్టేజ్ స‌మ‌స్య‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని ఆ ప్రకటనలో మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు.

Next Story